హైదరాబాద్ నగరానికి అతి పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ ఏమిటంటే చార్మినార్‌ అనే చెబుతారు. ఉదయం నుండి సాయంత్రం.. అర్ధరాత్రి నుండి తెల్లవారు జాము వరకూ అక్కడ ఎప్పుడు చూసినా సందడి సందడిగా ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. కరోనా వైరస్ కారణంగా గత కొద్ది రోజులుగా అక్కడికి వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఎక్కువ మంది ఉన్న చోట వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది అని వదంతులు వస్తున్న తరుణంలో ఛార్మినార్ చుట్టుపక్కలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. చుట్టుపక్కల ఉన్న మార్కెట్లు కూడా పెద్దగా గిరాకీలు లేక అల్లాడిపోతున్నాయి.

సాధారణంగా చార్మినార్‌ ను చూడడానికి ప్రతి రోజూ 3000 మందికి పైగా టూరిస్టులు వెళ్తుంటారు. కాస్త హాలిడే సీజన్ లో ఈ సంఖ్య కాస్త పెరిగే అవకాశం ఉంది. కానీ గత కొద్ది రోజులుగా 1200 నుండి 1400 మంది మాత్రమే వస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రజలు ఎక్కువ సమూహాలు ఉండే ప్రాంతాలకు వెళ్లాలని అనుకోవడం లేదని అందుకే ఛార్మినార్ దగ్గరకు ప్రజలు రావడం లేదని అంటున్నారు. వ్యాపారాలు లేక తమకు ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని అక్కడి వర్తకులు తెలిపారు. ఛార్మినార్ దగ్గరకు ఎంత ఎక్కువగా ప్రజలు వస్తే అంత ఎక్కువగా వ్యాపారాలు ఉంటాయి ఓల్డ్ సిటీ వర్తకులకు.. కానీ ఇప్పుడు వారి వ్యాపారాలకు కరోనా గండికొట్టింది. సెంటు అమ్మకం దారులు, బట్టలు అమ్మే వాళ్ళు, గాజుల వర్తకులు, ముత్యాలు అమ్మే వాళ్ళే ఎక్కువగా ఛార్మినార్ చుట్టుపక్కల ఉంటారు. కరోనా భయంతో ప్రజలు రాకుండా ఉండడంతో వ్యాపారాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.

Also Read: కరోనా వైరస్‌ ఒంట్లో చేరిన తర్వాత ఏమౌతుంది..? లక్షణాలు గుర్తించేదెలా?

హైలెవల్ కమిటీ సమావేశం

తెలంగాణలో రాబోయే రోజుల్లో మాల్స్, సినిమా హాళ్లు కూడా బంద్ చేయనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన హైలెవల్ కమిటీ సమావేశం ముగిసింది. కరోనాపై వైద్య అధికారులకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. విదేశాల నుంచి వస్తున్న వారి ద్వారానే కరోనా వ్యాప్తి జరుగుతోందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కరోనా విస్తరణను అరికట్టే క్రమంలో రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ ను ఈ నెల 31 వరకు బంద్ చేయాలని ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. క్యాబినెట్ సమావేశం ముగిశాకనే అఫీషియల్ గా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జరుగుతున్న పరీక్షలను ఆపకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Corona effect in charminar

అంతకు ముందు కేసీఆర్ కరోనా వైరస్ పై కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచాన్ని ప్రతి వందేళ్లకు ఒకసారి ఇలాంటి వ్యాధులు వణికిస్తాయని.. ప్రస్తుతానికి సభలు, సమావేశాలను నిర్వహించవద్దని పిలుపునిచ్చారు. ప్రజలంతా పరిశుభ్రతను పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం తరపున కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, వైరస్ పై ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఇద్దరు మరణించారని చెప్పారు. బయటి దేశం నుంచి వచ్చిన వాళ్లకే కరోనా వస్తోందని తెలిపారు. కరోనా ప్రభావం ఉన్న దేశాల నుంచి మన దేశానికి ఎవరొచ్చినా… వారిని 14 రోజులు ఐసొలేషన్ లో ఉంచుతున్నారని తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.