ఆస్పత్రి బాత్‌రూమ్‌లో 8 రోజులుగా కరోనా మృతదేహం ఘటనలో కలెక్టర్‌పై వేటు

By సుభాష్  Published on  18 Jun 2020 8:03 AM GMT
ఆస్పత్రి బాత్‌రూమ్‌లో 8 రోజులుగా కరోనా మృతదేహం ఘటనలో కలెక్టర్‌పై వేటు

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. కరోనా అంటేనే జంకుతున్నారు. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు కూడా దారుణంగానే ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మృతి చెందిన వారిని దూరం నుంచే చూడాలి తప్ప దగ్గరకు అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రంలో ఓ ఘటన కలకలం రేపుతోంది. జల్‌గావ్‌ సివిల్‌ ఆస్పత్రిని బాత్‌రూమ్‌లో కరోనాతో మరణించిన 82 ఏళ్ల వృద్ధురాలి మృతదేహం 8 రోజులుగా పడి ఉండటం సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో ప్రభుత్వం ఆ జిల్లా కలెక్టర్‌కు షాకిచ్చింది. ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు కలెక్టర్‌పై ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తిని ఎనిమిది రోజులుగా ఎవరూ గమనించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే ఆస్పత్రి యాజమాన్యం ఆ వృద్ధురాలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ క్రమంలోనే బాత్‌రూమ్‌లో ఆ వృద్దురాలు మృతదేహం లభించడంపై పెద్ద దుమారం రేపుతోంది. ఈ ఘటన విషయంలో జిల్లా కలెక్టర్‌పై బదిలీ వేటుపడింది. అలాగే ఆస్పత్రి సిబ్బందికి కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కాగా, అంతకు ముందే ఈ విషయం కలెక్టర్‌ దృష్టికి రాగా, ఆస్పత్రి సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నిర్లక్ష్యంగా వహించిన ఆస్పత్రి సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆ బాత్‌రూమ్‌లో 8 రోజుల నుంచి శుభ్రం చేయడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది.

ఈ ఘటనలో ఆస్పత్రి సిబ్బంది ఎంత నిర్లక్ష్యం ఉందో ఇట్టే అర్థమైపోతోంది. సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఒక వైపు దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో శుభ్రత పాటించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు హెచ్చరిస్తున్నా.. ఇలా ఆస్పత్రిలో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై మండిపడుతున్నారు.

Next Story