ఏపీలో 11 కరోనా అనుమానిత కేసులు

By సుభాష్  Published on  5 March 2020 6:26 AM GMT
ఏపీలో 11 కరోనా అనుమానిత కేసులు

కరోనా వైరస్.. ప్రపంచాన్ని సైతం వణికిస్తోంది. భారత్‌కు చేరిన కరోనా.. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్‌లో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది.అలాగే ఏపీలో కూడా ఇప్పటి వరకు 11 అనుమానిత కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. విశాకలో 5, శ్రీకాకుళంలో 3, ఏలూరు, కాకినాడ, విజయవాడలలో ఒకటి చొప్పున కేసు నమోదైనట్లు తెలిపింది. కరోనా అనుమానిత కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్తగా అనుమానితులను ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

కరోనా అనుమానిత కేసులు నమోదు కావడంతో సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో మల్లీ సెక్టోరల్‌ కో-ఆర్డీనేషన్‌ సమావేశమైంది. మరో వైపు హైదరాబాద్‌లో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఏపీ ముందుస్తుగా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మాస్కులు, వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసింది. ప్రజలకు ఎలాంటి అనుమానాలు ఉన్నా, కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు అనిపించినా వెంటనే సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.

భారత్‌లో కరోనా వైరస్‌ కలకలం రేపడంతో కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు సైతం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యులకు, సిబ్బంది, ప్రభుత్వ అధికారులకు అప్రమత్తం చేస్తున్నాయి. కాగా, కరోనా కోసం ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు కోసం హైదరాబాద్‌లో రెండు చోట్ల స్థలాలను పరిశీలించింది. కరోనా కోసం ప్రత్యేక నిధులు కేటాయించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నారు

దేశంలో ఇప్పటి వరకు 29 పాజిటివ్‌ కేసులు

దేశంలో ఇప్పటి వరకు 29 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు. ఇటలీ, చైనా, జపాన్‌ దేశాల్లో భారతీయులు ఎవరు పర్యటించవద్దని సూచించారు. అన్ని ఎయిర్‌ పోర్ట్‌లలో స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు పాజిటివ్‌ వచ్చిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు ఆందోళన ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కేంద్రం చెబుతోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలను నమ్మవద్దని తెలిపింది.

Next Story