గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా తెలంగాణ లెక్కలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 July 2020 9:26 AM GMT
గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా తెలంగాణ లెక్కలు

కేవలం నెల అంటే నెల రోజులు. ఆ చిన్న వ్యవధిలో జరగాల్సిందంతా జరిగిపోయిన తీరు చూస్తే షాక్ తినాల్సిందే. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య ఎలా ఉన్నా.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాలంతో పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న కేసుల తీవ్రత చూస్తే.. వణకాల్సిందే. ఇప్పటికైనా కళ్లు తెరిచి.. అప్రమత్తంగా ఉంటూ.. కనీస జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారి ముప్పు నుంచి తప్పించుకునే వీలుంది.

జూన్ ఒకటి నుంచి ఆరో తేదీ మధ్యన తెలంగాణలో 798 కేసులు నమోదైతే.. జూన్ 7 నుంచి 13 మధ్యన కేసుల సంఖ్య పెరిగి.. 1241కు చేరుకుంది. ఇక.. జూన్ మూడో వారంలో తెలంగాణ రాష్ట్రంలో కేసులు 2335కు పెరిగాయి. నాలుగోవారానికి ఈ సంఖ్య మరింత పెరిగిపోవటమే కాదు..గణాంకాలు చూసినంతనే గుండెల్లో రైళ్లు పరిగెత్తక మానదు.

ఎందుకంటే వారం వ్యవధిలో మూడు రెట్లు పెరిగిపోవటమే దీనికి కారణం. మూడో వారంలో 2335 కేసులునమోదైతే.. నాలుగో వారానికి 6364 కేసులు నమోదయ్యాయి. ఇక.. ఐదో వారానికి కేసుల సంఖ్య 8876కు చేరుకుంది. ఈ గణాంకాల్ని పరిశీలిస్తే.. జూన్ మొదటో వారానికి.. జులై మొదటి వారానికి మధ్య కేసుల నమోదు ఏకంగా పది రెట్లు పెరగటం గమనార్హం.

ఇంత జరుగుతున్నా.. హైదరాబాద్ రోడ్ల మీద వాహనాల రద్దీ తగ్గట్లేదు. మార్కెట్ల వద్ద భౌతిక దూరాన్ని పాటించని పరిస్థితి. ఇంతకంటే మరింత దారుణమైన విషయం ఏమంటే.. అనుమానిత లక్షణాలు ఉన్న వారు పరీక్షల కోసం ఆసుపత్రులకు.. ల్యాబ్ లకు వద్ద జనం పోటెత్తటం ఒక ఎత్తు అయితే.. అక్కడా భౌతిక దూరాన్ని పాటించకుండా.. తోసుకునే తీరు చూస్తే.. కేసుల సంఖ్య భారీగా పెరగటానికి ప్రభుత్వాల నిర్లక్ష్యం కంటే కూడా ప్రజల బాధ్యత ఎంతన్నది కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి.

Next Story