ఏపీలో 133 ప్రాంతాలు రెడ్ జోన్లుగా ప్రకటన
By సుభాష్ Published on 10 April 2020 2:06 PM GMTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీలో కోరలు చాస్తోంది. కాగా, రాష్ట్రంలో జిల్లాల వారీగా రెడ్ జోన్లను ప్రకటించింది ఏపీ సర్కార్. ఢిల్లీ మర్కాజ్ ప్రార్థనల నేపథ్యంలో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. మొత్తం రాష్ట్రంలో 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది.
జిల్లాల వారీగా..
- అనంతపురం జిల్లాలో- 3
- చిత్తూరు జిల్లాలో - 7
- తూర్పు గోదావరి జిల్లాలో - 8
- గుంటూరు జిల్లాలో - 12
- కడప జిల్లాలో - 6
- కృష్ణా జిల్లాలో - 16
- కర్నూలు జిల్లాలో 22
- నెల్లూరు జిల్లాలో 30
- ప్రకాశం జిల్లాలో 11
- విశాఖ జిల్లాలో 6
- పశ్చిమ గోదావరి జిల్లాలో 12
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించింది సర్కార్. దీని ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టనున్నారు.
కాగా, గురువారం రాత్రి 9 నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో అనంతపురం జిల్లాకు చెందిన రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఉదయం హెల్త్ బులిటెన్‌లో ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా నమోదైన రెండు కేసులతో మొత్తం 365కు చేరుకున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 892 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, అందులో 17 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది.
రాష్ట్రంలో నమోదైన 365 పాజిటివ్ కేసులకు గానూ 10 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం 349 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ఈ పాజిటివ్ కేసుల్లో 75 కేసులతో కర్నూలు మొదటి స్థానంలో ఉండగా, 51 కేసులతో గుంటూరు రెండో స్థానంలో, 48 కేసులతో మూడో స్థానంలో నెల్లూరు జిల్లా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.