క‌రోనా మ‌హ‌మ్మారి నియంత్రించ‌క లేక‌పోతే ముందుకు వెళ్ల‌డం సాధ్యం కాద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. సీఎంల‌తో ప్ర‌ధాని నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. భయం ఆందోళన తొలగించడం ద్వారానే సాధారణ పరిస్థితులు నెల‌కొంటాయ‌న్నారు. కేంద్రం సూచనలు, స‌ల‌హాల‌ను తూచ త‌ప్ప‌కుండా పాటిస్తున్నామ‌ని ఇందువ‌ల్లే రాష్ట్రంలో క‌రోనా కేసుల‌ను నియంత్రించ‌గ‌లిగామ‌ని చెప్పారు.

ఆ భావ‌న ఉండ‌డం వ‌ల్లే ముందుకు రావ‌డం లేదు..

ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్ల ద్వారా రాష్ట్రంలో మూడు సార్లు సమగ్ర సర్వే నిర్వ‌హించ‌డంతో.. దాదాపు 30వేల మందిలో కరోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని అనిపించ‌డంతో వారంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌న్నారు. ఆరువారాల లాక్‌డౌన్ పరిస్థితుల‌ను స‌మీక్షించుకుని సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొనే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కోవిడ్ ను నియంత్రించ‌క‌పోతే ముందుకు వెళ్ల‌డం సాధ్యం కాద‌న్నారు. ఓ వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ గా నిర్థార‌ణ అయితే.. అత‌ని కుటుంబం స‌మాజంలో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటుంద‌ని, స‌మాజం వారిని వేరు చేసి చూస్తోందన్న భావ‌న నెల‌కొంద‌న్నారు. ఈ కారణం వల్లనే కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పడం లేదన్నారు. ఇది మొత్తం కరోనా పరీక్షల ఉద్ధేశం, లక్ష్యాలపై ప్రభావం చూపిస్తోందన్నారు.

కరోనా కేసులు కనిపించిన ప్రాంతాలను క్లస్టర్లు, కంటైన్మెంట్‌ జోన్లుగా గుర్తించడం అదే విధంగా సంస్థాగతంగా క్వారంటైన్‌ ప్రక్రియపై మరోసారి ఆలోచన చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ ప్రక్రియలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక వ్యూహంతో ముందుకెళ్లాల‌ని తెలిపారు. కరోనా లక్షణాలు కనిపిస్తే స్వయంగా చెప్పడం, వైద్య సహాయం పొందడం, తమంతట తాముగా ఐసొలేషన్‌కు వెళ్లడం వంటివి కొనసాగాల్సి ఉంద‌న్నారు. దాదాపు 98 శాతం కేసులు నయం చేయగలమన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. 85 శాతం కేసుల్లో మైల్డ్‌సింప్‌టమ్స్‌ మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి కరోనాకు వ్యాక్సిన్‌ కనుక్కొనే వరకు ఆ వైరస్‌లో మనం కలిసి ముందుకు సాగాల్సి ఉందన్న విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంది.

జాగ్ర‌త్త‌లు పాటించ‌డం త‌ప్పని స‌రి..

భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, హ్యాండ్‌ శానిటైజర్ల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యమైనవని, వర్క్‌ ప్లేస్‌లు, ఉత్పత్తి కేంద్రాలు (మానుఫ్యాక్చరింగ్‌ యూనిట్లు), మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో ఒక స్పష్టమైన ప్రామాణికత (ఎస్‌ఓపీ)ను రూపొందించాల్సి ఉందన్నారు. అవసరమైన శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లు, కోవిడ్‌–19 సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా, కరోనా వ్యాధి లక్షణాలు కనిపించిన ప్రజలు ఎలాంటి భయం, సంకోచం లేకుండా తమంతట తాము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్ష చేయించుకోవడం, వైద్యం పొందేలా ప్రోత్సహిస్తున్నామ‌న్నారు.

వాటితో పాటు, టెలి మెడిసిన్, కాల్‌ సెంటర్లు కూడా కరోనా సోకిన వారికి పరీక్షలు, చికిత్స చేయడంలో తమ వంతు పాత్ర పోషించనున్నాయి. హైరిస్క్‌ ఉన్న వారికి మరింత అవగాహన కల్పించడంతో పాటు, హోం ఐసొలేషన్‌కు సంబంధించి ప్రజలకు కూడా అవగాహన కల్పించాల్సి ఉంది. వృత్తాలు గీయడం ద్వారా ప్రజలు భౌతిక దూరం పాటించేలా చేయడం, స్వీయ క్వారంటైన్‌కు సంబంధించి కూడా ఒక వ్యూహం రూపొందించాల్సి ఉంద‌న్నారు.

కోవిడ్‌ నివారణ చర్యల్లో ఆస్పత్రుల్లో పడకలతో పాటు, ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశాం. కానీ వాటిని ఇంకా ఇంకా పెంచాల్సి ఉందని, వైద్య ఆరోగ్య రంగంలో గ్రామ స్థాయి నుంచి అత్యున్నత స్థాయిలో టీచింగ్‌ ఆస్పత్రుల స్థాయిలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశలో రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. రోజులో 24 గంటల పాటు పని చేసే సిబ్బందితో గ్రామ క్లినిక్‌లు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నాం. పార్లమెంటు నియోజకవర్గంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా చాలా మందికి వైద్య సేవలు అందించడంతో పాటు, వాటిలో వైద్యులు, నర్సుల కొరత కూడా ఉండబోదు. అదే విధంగా అన్ని ఆస్పత్రులను సమూలంగా మార్చి, జాతీయ స్థాయిలో వాటిని తీర్చి దిద్దాల్సి ఉందన్నారు. గ్రామాల్లో పని చేసే క్లినిక్‌లు కూడా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండాల్సి ఉంది. ఎవరికి ఏ జబ్బు లక్షణాలు కనిపించినా, ఆ క్లినిక్‌లకు వెళ్లి వైద్య సలహాలు పొందాలి. అవసరమైతే చికిత్స కూడా అందించాలి. ఆ స్థాయి ప్రమాణాలతో అవి పని చేయాల్సి ఉంద‌న్నారు.

సరకుల రవాణా సాధారణస్థాయిలో జరగకుండా, వలస కూలీలు, కార్మికులు ఆయా ఫ్యాక్టరీల్లో పనిచేయగలిగే పరిస్థితులు లేకుండా, రాష్ట్రాల సరహద్దుల వద్ద సాధారణ పరిస్థితులు తలెత్తకుండా… ఆర్థిక వ్యవస్థ మళ్లీ పునరుజ్జీవం కాదన్నారు. ప్రజలకు తమ పనులకు వెళ్లాంటే ప్రజారవాణా అందుబాటులో లేదని, వెంట‌నే ప్రజారవాణా రంగంమీద ఉన్న ఆంక్షలను తొలగించాలన్నారు. బస్సుల్లో సరిపడినంత భౌతిక దూరం పాటించాలని, ప్రజారవాణాలో మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిచేయాలని తెలిపారు. ఆస్పత్రులు, ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధిచేయడానికి కనీసంరూ.16వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించచాలంటే ఈ విషయంలో కొత్త రాష్ట్రంగా మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కావాలని అవ‌స‌ర‌మైన నిధులు కేంద్ర‌మే ఇవ్వాల‌ని కోరారు.

ఉద్యాన పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌

వ్యవసాయం విషయానికొస్తే.. ఉద్యానవన పంటలతోపాటు మరిన్ని పంటలకు కనీస మద్దతు ధరలను ప్రటించాలని, సేకరణలో ప్రస్తుతం ఉన్న పరిమితిని 30 శాతం నుంచి 50శాతానికి పెంచాలన్నారు. అన్ని రాష్ట్రాల్లో హోల్‌సేల్‌ మార్కెట్లను తెరవాలన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు బాగుంటేనే..పేదలకు మేలు జరుగుతుందన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు చర్యల సమయంలో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నానని, పౌరులంతా సాధారణ జీవితాలు గడపడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్ర‌ధాని ని సీఎం కోరారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *