స్టైరిన్‌ తరలింపు ప్రక్రియ ప్రారంభం

By Newsmeter.Network  Published on  11 May 2020 8:13 AM GMT
స్టైరిన్‌ తరలింపు ప్రక్రియ ప్రారంభం

విశాఖ పట్టణం ఎల్‌జీ పాలిమర్స్‌‌ కర్మాగారంలో గ్యాస్‌ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కర్మాగారం నుంచి గ్యాస్‌ లీకవడంతో ఆ ప్రాంతంలోని వెంకటాపురం గ్రామంతో పాటు పలు గ్రామాలకు చెందిన 12మంది మృత్యువాత పడ్డారు. వందలమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందిస్తామని ప్రకటించారు. దీంతో సోమవారం వెంకటాపురం గ్రామంలో బాధిత కుటుంబాలకు మంత్రులు చెక్కులను అందజేశారు. ఇదిలాఉంటే రేపటి నుండి రెండు రోజుల పాటు గ్రామంలోని ప్రతి కుటుంబానికి రూ. 10వేలు అందించే కార్యక్రమాన్ని మంత్రులు చేపట్టనున్నారు. ఇదిలాఉంటే వెంకటాపురంతో పాటు చుట్టుపక్కల ఐదు గ్రామాల్లో పూర్తిస్థాయిలో డిశానిటైజ్‌ చేస్తున్నారు. గ్యాస్‌ లీకేజీ కారణంగా గ్రామాల్లో మాడిపోయిన చెట్లను తొలగించారు.

Also Read : విశాఖ ఘటన: బాధిత కుటుంబాలకు చెక్కుల అందజేత

మరోవైపు ట్యాంక్‌లలో ఉన్న స్టైరిన్‌ను తరలించే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం చేపట్టింది. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు స్టైరిన్‌ను తరలించే పనులను ముమ్మరం చేశారు. ఐదు ట్యాంకుల్లో 13వేల టన్నుల స్టైరిన్‌ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో నాలుగు రోజుల్లోనే ఈ 13వేల టన్నుల స్టైరిన్‌ను తరలించేందుకు చర్యలు ముమ్మరం చేశారు. ఈ స్టైరిన్‌ను దక్షిణ కొరియాకు తరలించనున్నారు. ప్రత్యేక నౌకల ద్వారా దీనిని తరలించనున్నారు. సాయంత్రంకు ఒక నౌక ద్వారా కొంత స్టైరిన్‌ను తరలిస్తారు. మిగతా స్టైరిన్‌ను నాలుగైదు రోజుల్లో రలించనున్నారు. ఈ మేరకు సోమవారం సీఎం జగన్మోహన్‌రెడ్డితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్టైరిన్‌ తరలింపు వివరాలను, చేపట్టిన చర్యలను విశాఖపట్టణం కలెక్టర్‌ వివరించారు.

Next Story
Share it