ఆర్థిక సంక్షోభం కాదు..ఆరోగ్య సంక్షోభాన్ని ఓడిద్దాం : సోనియాగాంధీ
By రాణి Published on 14 April 2020 1:21 PM IST
- దేశ రక్షణకై కృషి చేస్తున్నవారిపై సోనియా ప్రశంసలు
ప్రియమైన భారత దేశ ప్రజలారా ..కరోనా రక్కసి పాగా వేసిన ఆరోగ్య సంక్షోభాన్ని మనమంతా కలిసి ఎదుర్కోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. కరోనా నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కృషి చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులను ఆమె ప్రశంసించారు. వీరందిస్తున్న సేవలకు మించిన దేశ భక్తి మరొకటి ఉండదన్నారు. మంగళవారం ఉదయం విడుదలైన ఓ వీడియో సందేశంలో సోనియా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మోదీ జాతినుద్దేశించి ప్రగించడానికన్నా ముందే సోనియా వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
Also Read : మోదీ చెప్పిన సప్త సూత్రాలు
కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు భారతీయులు చూపిస్తోన్న తెగువ, సహనం ఎంతో గొప్పదని సోనియా కొనియాడారు. రాబోయే కాలంలో కూడా ఇదే స్ఫూర్తితో అందరూ ఇళ్లకే పరిమితమైతే కరోనాను దేశం నుంచి తరిమికొట్టొచ్చన్నారు. అలాగే కరోనా పై పోరాటంలో భాగంగా రోగులకు చికిత్స అందిస్తూ అదేవైరస్ బారిన పడి మరణించిన వారిని ఎప్పటికీ మరువలేమన్నారు. మనకోసం24 గంటలు కష్టపడుతున్నవారికి మనం సహకారం అందించకపోతే ఈ యుద్ధంలో విజయాన్ని సాధించలేన్నారు. ఇప్పటి వరకూ పడిన కష్టమంతా వృథా అవుతుందన్నారు. మరికొంతకాలం పాటు ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ శానిటైజర్లు వాడాలని సూచించారు. అలాగే ఇంట్లోనే భౌతిక దూరం పాటిస్తూ..సొంతంగా తయారు చేసుకున్న మాస్కులను వాడాలని సూచించారు.
Also Read : కరోనా, కోవిడ్ 19, లాక్ డౌన్..ఇప్పుడు శానిటైజర్, హ్యాండ్ వాషే తరువాయి
అలాగే కరోనా కారణంగా ఎక్కడికక్కడే ఆగిపోయిన పనులతో నిలువ నీడలేక, అన్నం పెట్టేవారు లేక బిక్కుబిక్కుమంటూ, ఆకలికేకలతో జీవనం సాగిస్తున్నవారి ఆకలిని తీర్చేందుకు చాలామంది స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందించదగిన విషయమన్నారు. ఇదే సేవను కొనసాగిస్తూ దేశంలో కరోనా సృష్టించిన క్లిష్టపరిస్థితుల నుంచి కోలుకునేంతవరకూ అన్నార్తులకు, ఆకలి కేకలతో అలమటిస్తున్నవారికి కడుపునిండా భోజనం అందించాలని సోనియా కోరారు. ఎవరికి ఎలాంటి అవసరమైనా కాంగ్రెస్ కార్యకర్తలు అందుబాటులో ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా ఇలాంటి సమయంలో ప్రజలకోసం పనిచేయాలని సోనియా పిలుపునిచ్చారు.క్షేత్రస్థాయిలో కావాల్సిన సహకారాన్ని అందించాల్సిందిగా కోరారు.
Also Read :కరోనా సోకి వైద్యుడు చనిపోతే..స్మశాన వాటిక బయట ఇలా..