ప్రపంచాన్నే వణికిస్తోన్న కరోనా చాలా ఫేమస్ అయిపోయింది. ఎంతలా అంటే..కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో పుట్టిన పిల్లలకు దానిపేరే పెట్టుకునేంతలా. ఇటీవల యూపీలో ఓ దంపతులకు పుట్టిన పిల్లాడికి లాక్ డౌన్ అని, కడపలో పుట్టిన ఇద్దరు పిల్లలకు కరోనా కుమారి, కరోనా కుమార్ అని పేర్లు పెట్టారు. ఇప్పుడు మరో బుడతడికి శానిటైజర్ అని నామకరణం చేశారు. ఇది కూడా యూపీలోనే జరిగింది.

Also Read : కరోనా సోకి వైద్యుడు చనిపోతే..స్మశాన వాటిక బయట ఇలా..

ఉత్తర్ ప్రదేశ్ లోని షహారాన్‌పూర్‌ జిల్లా విజయ్‌విహార్‌ ప్రాంతంలో ఓంవీర్‌సింగ్‌, మోనిక దంపతులు జీవనం సాగిస్తున్నారు. మోనిక నిండు గర్భిణి. ఆదివారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో స్థానిక ప్రసూతి ఆస్పత్రిలో చేర్చారు. పండంటి మగబిడ్డకు మోనిక జన్మనివ్వగా భర్త ఓంవీర్ ఆ బుడతడికి వెంటనే శానిటైజర్ అని నామకరణం చేస్తున్నట్లు చెప్పాడు. ఇది విన్న ఆస్పత్రి వైద్యులు, నర్సులంతా ఒక్కసారిగా నవ్వేశారు. కరోనా విజృంభణ కాలంలో పుట్టిన తన కొడుకు కరోనాను జయించే శక్తిగా ఉన్నట్లు తాను నమ్ముతున్నానని ఓంవీర్ తెలిపాడు. అందుకే తన బిడ్డకు శానిటైజర్ అని నామకరణం చేయదలచినట్లు తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

Also Read : కరోనాను జయించిన ఆరు నెలల చిన్నారి

ఎందుకంటే కరోనా వైరస్ చేతులకు అంటినా అది శానిటైజర్ కారణంగా చనిపోతుంది కదా. తానేదో ఈ విషయాన్ని సరదాగా అనలేదు. నిజంగానే బంధువులందరికీ ఫోన్ చేసి లాక్ డౌన్ ముగియగానే నామకరణ మహోత్సవం చేద్దామంటూ పిలుపులు కూడా చెప్పేశాడు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.