ఏపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతల దీక్ష

By Newsmeter.Network  Published on  13 May 2020 7:51 AM GMT
ఏపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతల దీక్ష

ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచి, భారీగా నీటిని తరలించుకు పోయే ప్రయత్నం చేయడాన్ని నిరసిస్తూ.. 203 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ గాంధీభవన్‌ వద్ద బుధవారం కాంగ్రెస్‌ పార్టీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. నల్ల రిబ్బన్లు కట్టుకొని దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలో మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంత్‌రావు, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌, చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, డీసీసీలు రామ్మోహన్‌రెడ్డి, చల్ల నర్సిహారెడ్డి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Also Read :వెనక్కి తగ్గని జగన్‌.. కృష్ణాబోర్డుకు, కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తన స్వార్థం కోసం స్వరాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను కేసీఆర్‌ నిర్లక్ష్యం చేస్తున్నారని, కేసీఆర్‌ నిర్లక్ష్యం కారణంగానే జగన్‌ జీవో 203తీసుకొచ్చారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడును అడ్డుపెట్టుకొని సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. అందరికంటే ముందు స్పందించాల్సిన కేసీఆర్‌ .. మౌనంగా ఉండటం వల్లే ఏపీ ఇలాంటి చర్యలకు పూనుకుంటుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కొద్దిరోజులుగా ఈ విషయాన్ని చెబుతున్నా.. కేసీఆర్‌ మౌనంగా ఉన్నాడని, ప్రజల్లో వ్యతిరేఖత వస్తుందనే భయంతో ఇప్పుడు అక్కడ ఫిర్యాదు చేశాం, ఇక్కడ ఫిర్యాదు చేశాం అంటున్నాడని విమర్శించారు.

Also Read :చేపల వలలో నోట్ల కట్టలు..! ఏం చేశాడంటే..?

కేసీఆర్‌కు జగన్‌కు మధ్య అవగాహన ఉందని, కేసీఆర్‌ తలుచుకుంటే జగన్మోహన్‌రెడ్డిని పిలిచి చెప్పొచ్చన్నారు. ఏపీ సీఎం చర్యను అడ్డుకోకపోతే తెలంగాణా దగా అవుతుందని అన్నారు. కేసీఆర్‌ ఒక్క ఉత్తర తెలంగాణకు మాత్రమే సీఎం కాదని, మూడు వేల ఎకరాలు సాధించలేక మహారాష్ట్ర సీఎంతో చర్చించి ఏడు మీటర్ల తక్కువ ఎత్తులో కాళేశ్వరం కట్టారని విమర్శించారు. నాడు ఏడు మండలాలు ఏపీలో కలిస్తే కేసీఆర్‌ స్పందించలేదని విమర్శించారు. ఇప్పుడు కేసీఆర్‌ జీవో 203ను రద్దు చేయించకపోతే చరిత్ర హీనులు అవుతారని కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానించారు. కరోనా నివారణలో మనమంతా ఉంటే ఏపీ సీఎం జగన్‌ మాత్రం మన నీళ్లు దోచుకొనే పనిలో పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read :4గంటలకు నిర్మలా సీతారామన్‌ ప్రెస్‌మీట్‌.. పారిశ్రామిక వర్గాల్లో ఉత్కంఠ!

Next Story