బెంగళూరు: బీజేపీ ప్రభుత్వం పోలీస్‌ శాఖను దుర్వినియోగం చేసిందంటూ.. కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ నాయకులు, దినేశ్‌ గుండూరావు, రిజ్వాన్‌ అర్షద్‌, కె.సురేశ్‌లు.. ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప ఇంటి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. రేస్‌ కోర్స్‌ రోడ్‌లోని గాంధీ విగ్రహం నుంచి ఈ ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.

బీదర్‌ పాఠశాల దేశ ద్రోహం కేసుకు నిరసనగా వారు ఈ ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీకి కార్యకర్తలు హాజరుకావడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉందని.. సిద్ధరామయ్యతో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.. విద్యార్థిని తల్లిని అరెస్ట్‌ చేయడం రాజ్యంగ విరుద్ధమని, తల్లీ పిల్లల్ని వేరు చేయడం అమానవీయమని అన్నారు. పోలీసు చర్య అప్రజాస్వామికమని, బీజేపీని వ్యతిరేకిస్తున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేయిస్తోందని సిద్ధరామయ్య ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు అసభ్యకరమైన భాష, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నప్పటికి వారిపై కేసులు మాత్రం నమోదు చేయడం లేదన్నారు.

ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా నాటకాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు ప్రదర్శించారు. అయితే వారిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ ఘటన బీదర్‌లోని శాహిన్‌ స్కూల్‌లో జరిగింది. కాగా దీనిపై జిల్లా కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. పోలీసులు వ్యహరించిన తీరుని కోర్టు తప్పుబట్టింది. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఫిబ్రవరి 19లోగా దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నాటకాన్ని రాసిన ఓ విద్యార్థిని తల్లి అనుజా మిన్సా, టీచర్‌ ఫరీదా బేగానికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అంతముందు వారు రెండు వారాలపాటుగా జైలులో ఉన్నారు.

పోలీసుల ఉపయోగించి బీజేపీ ప్రభుత్వం.. కాంగ్రెస్‌ అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.