ఢిల్లీ: ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే రీతిలో కేంద్రంలో కొలువుతీరిన బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని జాతీయ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తోందంటూ ధ్వజమెత్తింది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితా పేరుతో దేశ ప్రజల మధ్య మరింత విద్వేషాలు పెంచేలా చేస్తోందంటూ ఆరోపించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మెజారిటీ జనమంతా కుల, మతాలకు అతీతంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేసింది. తాజాగా బీజేపీ ఈ రెండింటినీ ఫోకస్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేసినా, అధికారం కోల్పోయిందన్న విషయాన్నీ గుర్తించాలని హెచ్చరించింది.

ప్రతి చోటా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థులు, యువతీ యువకులు, ప్రజలతో పాటు రాజకీయ పక్షాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రజా సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. పాలన కూడా. దేశంలోని ప్రజలను మభ్య పెట్టేందుకే పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితాలను తెరపైకి తీసుకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నిరుద్యోగిత పెరిగి పోయింది. పేదలు, సామాన్యులు బతికే పరిస్థితులు లేవు. వ్యాపార, వాణిజ్య రంగాలతో పాటు ప్రభుత్వ బ్యాంకులు పూర్తిగా కోలుకోలేని స్థితికి వచ్చాయంటూ కాంగ్రెస్‌ ఆరోపించింది. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే పొరసత్వ సవరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. జాతీయ పౌరుల జాబితా పేరుతో ఇప్పటి దాకా కలిసి మెలిసి ఉన్న ప్రజల మధ్య తిరిగి పొరపొచ్చాలు వచ్చేలా బీజేపీ చేస్తోందని కాంగ్రెస్‌ మండిపడుతోంది.

ఉప ఖండంలో తమ పార్టీ శాంతిని కోరుతోందని… దేశంలో తక్కువ జనాభా కలిగిన అల్పసంఖ్యాక వర్గాలకు కూడా బతికే హక్కు ఉందని పార్టీ నమ్ముతుందని తెలిపింది. ఇక్కడ ప్రతి ఒక్కరికి బతికే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందని.. దానినే తాము నమ్ముతున్నామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ప్రతి సున్నితమైన అంశాలను సమస్యలుగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ పేర్కొంది. ప్రధానంగా విద్యార్థులు, పౌర సమాజపు సంస్థలు, సంఘాలను ఇబ్బందులకు గురి చేస్తోందని.. ఇప్పటికే పలువురు ఆందోళనల్లో మృతి చెందారని కాంగ్రెస్‌ వ్యాఖ్యనించింది. తాజాగా జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభావం ఎదురైంది.

సీఏఏకు వ్యతిరేకంగా దేశ మంతటా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. విద్యా పరంగా యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ ఐటీలు , ఐఐఎం లు, విద్య సంస్థలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. దేశం అస్తవ్యస్తంగా మారి పోవడంతో అది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బీజేపీ తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చు కోవాలని ఇలాంటి లేని పోనీ ఇస్స్యూస్ ను పైకి తీసుకు వస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్