నేడే.. కాంగ్రెస్ 'భారత్ బచావో' ర్యాలీ.. మ‌రికాసేప‌ట్లో..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Dec 2019 7:11 AM GMT
నేడే.. కాంగ్రెస్ భారత్ బచావో ర్యాలీ.. మ‌రికాసేప‌ట్లో..

రామ్‌లీలా మైదానం వేదిక‌గా కాంగ్రెస్ నేడు 'భారత్ బచావో' ర్యాలీని నిర్వ‌హించ‌నుంది. ఈ ర్యాలీని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. సభా ప్రాంగ‌ణంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్, ప్రియాంక వాద్రాల భారీ కౌటౌట్లు ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ ఈ ర్యాలీ ద్వారా ప్ర‌ధాని మోదీ ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ద‌మ‌వుతుంది. అందుక‌ని కాంగ్రెస్ శ్రేణ‌లు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భారీగా కార్యకర్తల స‌మీక‌ర‌ణ చేస్తుంది. ర్యాలీకి భారీ ఎత్తున జనసమీకరణ చేయడం ద్వారా మోదీ ప్రభుత్వానికి గట్టి సందేశం ఇవ్వాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది. ఈ ర్యాలీలో నిరుద్యోగ, రైతు సమస్యలతో పాటు దేశ ఆర్థిక మాంద్యం స‌మ‌స్య‌లను ప్రధానంగా హైలైట్ చేయనున్నారు.

ర్యాలీనుద్దేశించి సోనియా, మన్మోహన్, రాహుల్ తో పాటు మ‌రికొంద‌రు నేతలు ప్రసంగించనున్నారు. అలాగే.. మోదీ హై తో ముంకిన్ హై (మోదీ వస్తే ఏదైనా సాధ్యం) అనే బీజేపీ నినాదానికి బ‌దులుగా కాంగ్రెస్ కార్యకర్తలు మోదీ హై తో మండీ హై (మోదీ ఉంటే అధిక ధరలు) అనే కొత్తనినాదంతో ప్ర‌భుత్వ‌తీరును ఎండ‌గ‌ట్టేందుకు సిద్ద‌మ‌వుతుంది.

ఇదిలావుంటే.. కాంగ్రెస్ భారత్ బచావో ర్యాలీని ముందు నవంబర్ 30న నిర్వ‌హించాల‌నుకుంది. అయితే.. పార్లమెంటు శీతాకాల సమావేశాలను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 14కు వాయిదా వేసింది. దీంతో నేడు రామ్‌లీలా మైదానం వేదిక‌గా ఈ ర్యాలీ జ‌రుగ‌నుంది.

Next Story