గాంధీ భ‌వ‌న్‌లో కొన‌సాగుతున్న రైతు సంక్షేమ దీక్ష

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 May 2020 8:00 AM GMT
గాంధీ భ‌వ‌న్‌లో కొన‌సాగుతున్న రైతు సంక్షేమ దీక్ష

లాక్‌డౌన్ నేఫ‌థ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు గాంధీ భ‌వ‌న్ వేదిక‌గా రైతు సంక్షేమ దీక్ష చేప‌ట్టారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు మొద‌లైన ఈ దీక్ష‌ సాయంత్రం 4 గంటల వరకు కొన‌సాగ‌నుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ‌రెడ్డి పిలుపు మేర‌కు.. తెలంగాణ‌లోని అన్ని జిల్లాల డీసీసీ కార్యాలయాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఈ రైతు సంక్షేమ దీక్షలు చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వంపై విమర్శ‌లు గుప్పించారు. కోట్లాది రూపాయ‌ల‌ను విరాళంగా తీసుకుంటున్న ప్ర‌భుత్వం.. మాటల వరకే పరిమితం అయ్యింద‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వలస కూలీల రవాణా చార్జీలను భరిస్తుంద‌ని అన్నారు. వలస కూలీలు వెళ్లిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. వలస కూలీలు వెళ్ళిపోతే తెలంగాణ లో అభివృద్ధి కుంటుపడుతుందని ఉత్త‌మ్ అన్నారు. వలస కూలీలు ఎంత మంది ఉన్నారనే విషయంలో ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదని.. సొంత‌వూళ్ల‌కు వెళ్లాల‌నుకున్న వలస కూలీలను ఉచితంగా సొంత గ్రామాలకు తరలించాలని కోరారు.

ప్ర‌భుత్వం రైతుల వద్ద నుండి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికే రైతు దీక్ష చేపట్టామ‌ని ఉత్త‌మ్ అన్నారు. ప్ర‌భుత్వానికి వైన్ షాపులు తెరవడం మీద‌ ఉన్న శ్రద్ధ.. ధాన్యం కొనుగోలుపై లేదని విమ‌ర్శించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రతీ పేద కుటుంబానికి 5 వేలు ఇవ్వాలని.. తెలంగాణ ప్రభుత్వం 12 కేజీల బియ్యం విషయంలో మోసం చేసిందని అన్నారు. బత్తాయి పండ్లను రేషన్ తో పాటు సామాన్యులకు సరఫరా చేయాలని.. బత్తాయి గతంలో టన్ను 40 వేలు అమ్ముడుపోగా... ఇప్పుడు 10 వేలకు కూడా రావడం లేదని ఉత్తమ్ అన్నారు.

Next Story