ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రానికి అభినందనలు
By Newsmeter.Network Published on 27 March 2020 5:48 AM GMTఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్ర త్యేక ప్యాకేజీని ప్రకటించటం పట్ల చంద్రబాబు అభినందించారు. అధిక జనాభా కలిగిన భారతదేశంలో కోవిడ్ -19 ముప్పు అధికంగా ఉంటుందని, కానీ మీ సారథ్యంలో కరోనా వైరస్ ముప్పును సమర్థవంతంగా తిప్పికొడతారనే నమ్మకం మాకుందని చంద్రబాబు పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను అంతమొందించడంలో మీరు తీసుకుంటున్న ప్రతీ నిర్ణయానికి మా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మీరు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు ప్రజలంతా మద్దతుగా నిలిచారని, లాక్‌డౌన్‌కు అదేరీతిలో స్పందిస్తూ ఇండ్లలో ఉంటూ మీ సూచనలు అనుకరిస్తున్నారని అన్నారు.
Also Read :యువకుడిని చితకబాదిన ఎస్‌ఐ.. సస్పెండ్ చేసిన డీజీపీ
ఏప్రిల్ 14వరకు లాక్‌డౌన్‌లో భాగంగా రూ.17,500 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం పట్ల సమాజంలోని వివిధ వర్గాలు ఎంతో ప్రసంశిస్తున్నాయని కొనియాడారు. అదేవిధంగా సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల రంగాన్ని ఆదుకోవాలని చంద్రబాబు ప్రధాని మోదీనిని కోరారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగం దెబ్బతినకుండా చూడాలన్నారు. ప్రజానీకం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్న చంద్రబాబు.. రైతులకు ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన నగదు కూడా ముందే ఇవ్వడం అభినందనీయమని అన్నారు. రైతులకు ఆర్థిక ప్యాకేజీని అందించడం, పేద మహిళలకు ఎక్స్ గ్రేషియా, పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తక్కువ వేతన సంపాదకులకు మద్దతుగా నిలవడం, సీనియర్ సిటిజన్లకు మద్దతుగా, వారిని రక్షించడానికి సరైన చర్యలు తీసుకోవటం అభినందనీయమని అన్నారు.
Also Read :కొద్దిసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. మూడు నెలల కాలానికి ఖర్చుల నిమిత్తం ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం
ఏ ఒక్క భారతీయుడు ఖాళీ కడుపుతో పడుకోకుండా చూసేలా ప్రయత్నాలు చేయడం మీ ప్రభుత్వం మానవత్వం, వ్యక్తిత్వానికి నిదర్శనం అని చంద్రబాబు కొనియాడారు. లాక్ డౌన్ సమయంలో మీరు అమలు చేస్తున్న పథకాల్లో మూడింట రెండు వంతుల జనాభాకు మేలు జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. మీ నాయకత్వంలో అతి త్వరలోనే భారత్ కరోనా వైరస్ ముప్పు నుండి కోలుకుంటుందని, మళ్లి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.