యావత్‌ భారత్‌దేశాన్ని కలిచివేసిన హృదయ విదారక ఘటన.. NHRCలో ఫిర్యాదు

By సుభాష్  Published on  29 May 2020 11:50 AM IST
యావత్‌ భారత్‌దేశాన్ని కలిచివేసిన హృదయ విదారక ఘటన.. NHRCలో ఫిర్యాదు

తన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలియని ఆ పసివాడు ఆ తల్లిని లేపేందుకు చేస్తున్న ప్రయత్నం అందరి హృదయాలను ద్రవించేలా చేస్తోంది. ఓ హృదయ విదారక ఘటన యావత్‌ భారత్‌దేశాన్ని కలిచివేసింది. ఎండలు మండిపోతుండటంతో తల్లి ఆకలితో అలమటించి చనిపోయిందని తెలియని రెండేళ్ల బాలుడు ఆమె శవం పక్కనే కూర్చొని ఆడుకున్న ఘటన అందరిని కంటతడిపెట్టించింది. అయితే ఈ ఘటన బీహార్ లోని ముజఫర్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ లో ఈనెల 25న జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై మహమ్మూద్‌ అనే న్యాయవాది బీహార్‌ ప్రభుత్వం, రైల్వేశాఖపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. సదరు మహిళ రైల్వేస్టేషన్‌లో సరైన తిండి, వసతి లేక చనిపోయిందని, దీనికి బీహార్‌ సర్కార్‌, రైల్వేశాఖల నిర్లక్ష్యమే కారణమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా, ఈ ఘటన మే 25వ తేదీన రికార్డు అయిన సీసీటీవీ పుటేజీని పరిశీలించి ప్రభుత్వం, రైల్వేశాఖలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, రైల్వేశాఖ వలస కార్మికులకు రైళ్లలో సరైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని న్యాయవాది ఎన్‌హెచ్‌ఆర్సీకి తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం.. ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత గౌరవంతో పాటు జీవించే హక్కు ఉందని గుర్తు చేశారు. అంతేకాకుండా వారికి కనీస వసతులు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, సదరు మహిళ కుటుంబానికి తక్షణ నష్టపరిహారాన్ని అందించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు.

Complaint filed in NHRC

కాగా, గుజరాత్‌లో రైలెక్కిన ఆమె ముజఫర్‌పూర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆకలితో నిరసించిన ఆ మహిళ ఒక్కసారిగా స్టేషన్‌లోనే కుప్పకూలిపోయింది. అయితే ఆమె చనిపోవడంతో ఆమె మృతదేహాన్ని పోలీసులు ప్లాట్‌ ఫాం వద్దనే ఉంచారు. ఇలా తల్లిచనిపోయిందని ఆ చిన్నారికి తెలియక తల్లిని లేపుతూ, ఆడుకుంటు ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూపిన ప్రతి ఒక్కరు కంటతడిపెట్టుకున్నారు.

ఇలా దేశంలో కరోనా రక్కిసి వల్ల లాక్‌డౌన్‌ విధించడంతో ఎందరో వలస కూలీల బతుకులు ధీనంగా మారాయి. చేసుకునేందుకు పనులు లేక, తినేందుకు తిండిలేక ఆకలితో అలమటించి ఎందరో ప్రాణాలు పోయిన సందర్భాలున్నాయి. రెక్కాడితే కాని డొక్కాడని వలస జీవులకు లాక్‌డౌన్‌ శాపంగా మారింది. ఇలాంటి వలస జీవులకు ఎన్నో చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా.. కొందరు బతుకులకు ఆ చర్యలు అందక మృత్యువాత పడుతున్నారు. జీవితంలో ఇలాంటి దయనీయ పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోని వారికి లాక్‌డౌన్‌ శాపంగా మారిందనే చెప్పాలి.

Next Story