చేతులు జోడిస్తున్నా.. దయచేసి ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండండి..
By అంజి Published on 26 March 2020 7:09 PM IST
అమరావతి: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో స్వీయ నియంత్రణ చాలా అవసరమని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
అందరూ సామాజిక దూరం పాటించాలి. నాలుగు చోట్ల కోవిడ్-19 ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాము. కోవిడ్-19 ప్రత్యేక ఆస్పత్రుల్లో 450 ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ అన్నారు.
అలాగే ప్రతి జిల్లాలో క్వారంటైన్ కోసం 200 ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు, ప్రతి నియోజకవర్గ పరిధిలో 100 బెడ్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
80 శాతం మంది ఇళ్లల్లో ఉండే కరోనాను ఎదుర్కొన్నారు. కేవలం 14 శాతం మాత్రమే ఆస్పత్రులకు వెళ్లిన పరిస్థితి, నాలుగు శాతం మంది మాత్రమే ఐసీయూకు వెళ్లారు.. అని అన్నారు.
ప్రజలందరికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా.. ఏ గ్రామంలో ఉండేవారు ఆ గ్రామంలోనే ఉండండి. ఏ జిల్లాలో ఉన్న వారు ఆ జిల్లాల్లోనే ఉండండి. ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలోనే ఉండండి. ఎలాంటి అవసరం ఉన్నా 1902 హెల్ప్‌లైన్ ఫోన్ చేయండి అని సీఎం జగన్ కోరారు.
హైదరాబాద్‌లో ఉన్న వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిని సర్వే చేయిస్తున్నాం. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోస ఇబ్బందులుంటే వెంటనే వాలంటీర్ల ద్వారా సచివాలయానికి సమాచారం ఇవ్వాలన్నారు. అలా గుర్తించిన వారికి ఆరోగ్య సేవలు అందించాలని ఆదేశాలిచ్చామన్నారు.
మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌లు, అధికారుల సమన్వయంతో కరోనా వైరస్‌పై పర్యవేక్షిస్తున్నామన్నారు. సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబు ఆధ్వర్యంలో 10 మంది ఐఏఎస్‌లు 1902 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల కొరత లేదు. ప్రతి 2, 3 కిలోమీటర్ల పరిధిలో రైతు బజార్లను విస్తరిస్తున్నాం.. ఎవరూ భయపడవద్దు, ఆందోళన కూడా వద్దు. అన్నీ అందుబాటులో ఉంటాయి, ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కనీస అవసరాల కోసమే బయటకు రండి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిత్యావసరాల కోసం బయటకు రావొచ్చు అని సీఎం జగన్ అన్నారు.
పొలం పనులకు వెళ్లేవారు కూడా సామాజిక దూరం పాటించాలి. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను ఆదేశించామన్నారు.
ఏప్రిల్ నాలుగు నుంచి ప్రతి ఇంటికి రూ.1000 ఇస్తాము. చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా.. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండి అని సీఎం జగన్ అన్నారు. తెలంగాణ నుంచి వస్తున్న మన వాళ్లను కూడా రా ష్ట్రంలోకి అనుమతించలేకపోవడం బాధకలిగించిందన్నారు. ఎక్కడున్న వాళ్లు అక్కడే ఉండకపోతే ఈ వ్యాధిని నియంత్రించలేమన్నారు. రాష్టర్ సరిహద్దుల వద్దకు వస్తున్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడే ఉండండి అని సీఎం జగన్ కోరారు. రాబోయే మూడు వారాలు ఎక్కడికి కదలవద్దని విజ్ఞప్తి చేశారు. నిన్న రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చిన సుమారు 200 మందిని క్వారంటైన్‌లో ఉంచామన్నారు.