ఓవైసీ మాటతోనే సీఎం బాధతో ప్రెస్ నోట్ బయటకు వచ్చిందా?
By సుభాష్ Published on 11 July 2020 10:55 AM ISTహైకోర్టు తీర్పు వచ్చిందో లేదో.. యుద్ధ ప్రాతిపదికన వేల మంది పోలీసుల పహరాలో.. అర్థరాత్రి దాటిన తర్వాత తెలంగాణ సచివాలయాన్ని పెద్ద ఎత్తున కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. కూల్చివేత ప్రారంభించటానికి కొద్ది గంటల మందు వరకూ ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా.. భారీ ఎత్తున బందోబస్తు చేపట్టారు. ఈ క్రమంలో సచివాలయంలోని నల్లపోచమ్మ గుడితోపాటు మసీదును కూడా కూలగొట్టారు.
దీనికి సంబంధించి.. తాము ఎలాంటి ప్రాసెస్ నిర్వహించిన వైనాన్ని ఆ మధ్యనే అనధికారికంగా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో పేర్కొనటాన్ని మర్చిపోలేం. అందరి అంచనాలకు భిన్నంగా శుక్రవారం ఉదయాన్నే సీఎం కేసీఆర్ బాధతో కూడిన వేదన ప్రెస్ నోట్ విడుదలైంది. సచివాలయాన్ని కూల్చివేసే క్రమంలో అనుకోని రీతిలో దేవాలయం.. మసీదును కూడా తీసేశారు. ఆ ప్రక్రియ ఎలా సాగిందన్న విషయాన్ని ప్రెస్ నోట్ లో పేర్కొన్నట్లుగా సమాచారం.
గుట్టుచప్పుడు కాని రీతిలో సచివాలయం కూల్చివేయటాన్ని పలువురు తప్పు పడుతుంటే.. గుడిని.. మసీదును తీసివేసిన వైనంపై పలువురు మండిపడుతున్నారు. అన్నింటికి మించి సచివాలయంలోని పురాతన మసీదును అలా ఎవరికి చెప్పకుండా.. మందస్తుగా జాగ్రత్తలు తీసుకోకుండా తీసివేయటంపై మైనార్టీ వర్గాలు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందన్న ఆందోళనతో పాటు.. నిరసనలు చేపట్టాల్సి వస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
సచివాలయంలోని మసీదు విషయంలో జరిగిన పరిణామంపై సీఎం కేసీఆర్ కు స్నేహితుడు కమ్ మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కలత చెందినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. తన ఆవేదనతో పాటు.. ఈ వ్యవహారంపై సీఎం స్పందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి యుద్ధ ప్రాతిపదికన ప్రెస్ నోట్ రిలీజ్ అయినట్లుగా తెలుస్తోంది.
శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు సాగే వేళకు.. సీఎం బాధతో కూడిన లేఖ రావటం మంచిదన్న సూచనతో పొద్దున్నే ప్రెస్ రిలీజ్ బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. స్నేహితుడికి ఏ దశలోనూ ఇబ్బంది కలగకూడదన్న రీతిలో ఓవైసీ తీరు ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి తగ్గట్లే ఆయన ట్వీట్ కూడా ఉందంటున్నారు.
సచివాలయం కూల్చివేత వేళ.. దెబ్బ తిన్న మసీదు స్థానే.. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంతో మసీదును.. మందిరాన్ని నిర్మిస్తానని చెప్పటంపై అసద్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీఎం స్వయంగా హామీ ఇవ్వటంతో ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏమైనా ఓవైసీ స్నేహధర్మాన్ని అభినందించాల్సిందే.