రైతులకు అండదండగా ఉండడమే మా పాలసీ : సీఎం కేసీఆర్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Sept 2020 6:08 PM ISTతెలంగాణ శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ చట్టంపై మాట్లాడుతూ.. తెలంగాణలో కౌలుదారి వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోదని.. రైతులకు అండదండగా ఉండడమే తమ పాలసీ అని స్పష్టం చేశారు. పట్టా పాసుపుస్తకాల్లో అనుభవదారు కాలమ్ ఉండదని సీఎం తేల్చిచెప్పారు.
ఒకప్పుడు జమీందార్లు, జాగీర్ దార్లు ఉన్నప్పుడు కౌలుదార్లను రక్షించాలని అనుభవదారు వ్యవస్థను తీసుకొచ్చారని.. ఆనాడు కౌలుదారీ చెల్లిందని.. ఇప్పుడు కౌలుదారి వ్యవస్థను పట్టించుకోమని సీఎం అన్నారు. 93 శాతానికి పైగా చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని.. 25 ఎకరాల భూమి ఉన్నోళ్లు .28 శాతం మంది మాత్రమే ఉన్నారు.
కొన్ని భూములు నాన్ అగ్రికల్చర్ కింద ఉన్నాయని.. అనుభవదారు కాలమ్ వల్ల అసలు రైతులకు సమస్యలు వస్తాయన్నారు. ఆస్తులంటే భూములు ఒక్కటే కాదని.. నగరాల్లో కూడా కంపెనీలు, ఇండ్లు కిరాయికి ఇస్తాం. అవి కూడా ఆస్తులే అని అన్నారు. అయితే.. అక్కడ అనుభవదారు కాలమ్‌కు ఎందుకు ప్రాధాన్యత ఇస్తలేమని.. మట్టి తీసుకునే రైతులు అగ్గువకు దొరికారా? అని ఉద్వేగంగా అన్నారు.
భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు చెల్లిందని. ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదని.. ఇప్పుడున్న అనుభవదారు కాలమ్‌తో చిన్న, సన్నకారు రైతులకు నష్టం కలుగుతుందని సీఎం అన్నారు. అందుకనే అనుభవదారు కాలమ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రైతులకు అండదండగా ఉండడమే మా పాలసీ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వమే నేరుగా రైతులకు రైతుబంధు అందిస్తున్నప్పుడు అనుభవదారు కాలం అవసరం లేదని కేసీఆర్ అన్నారు. దళిత కుటుంబాలకు అవకాశం ఉన్న మేరకు మూడు ఎకరాల భూమిని కొనిస్తున్నామని.. ప్రస్తుతం పంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూమే లేదని కేసీఆర్ అన్నారు.
భూములు క్రమబద్దీకరణ చేసి అందరికీ న్యాయం చేస్తామని కేసీఆర్ అన్నారు. భూములు పంపిణీ చేస్తామని అసత్యాలు చెప్పి.. ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వమని.. సత్యాలు చెప్పి నిజాయితీగా ఉంటామన్నారు. భూములు పంచుతామని రాజకీయ డైలాగులు చెప్తే సరికాదని సీఎం కేసీఆర్ అన్నారు.