హైదరాబాద్ : హుజూర్‌ నగర్‌లో భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు సీఎం కేసీఆర్‌. హుజూర్ నగర్ విజయంతో కార్యకర్తలు గర్వపడకూడదన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ తెచ్చిన పార్టీగా తమపై చాలా బాధ్యతలు ఉన్నాయన్నారు. ఎన్నికల కమిషన్ అనుమతిస్తే..ఎల్లుండి హుజూర్ నగర్‌ లో సభ నిర్వహిస్తామన్నారు. హుజూర్ నగర్‌ ప్రజల ఆశలు నెరవేరుస్తామన్నారు. ఇక..పనిలో పనిగా ప్రతిపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు సీఎం కేసీఆర్‌. అహంభావం, అహంకారం మంచిది కాదన్నారు.

చిల్లర యూనియన్ల రాజకీయ సమ్మె..!

నాలుగేళ్లలో ఆర్టీసీ కార్మికులకు 67 శాతం జీతాలు పెంచామన్నారు. దేశంలో ఎక్కడా ఇలా పెంచలేదన్నారు.. గత ఐదేళ్లలో 21 శాతం వృద్ధి సాధించామన్నారు. రాష్ట్రంలో 57 కార్పొరేషన్లు ఉన్నాయని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మిగతా కార్పొరేషన్లను ఏం చేయాలన్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీని ఎత్తేశారని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో ఆర్టీసీని సీపీఎం మూసేసిందన్నారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఆర్టీసీని కాంగ్రెస్‌ ప్రభుత్వం మూసేసిందన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ 14 కోట్ల నష్టాల్లో ఉండేదని..ఏడాదిన్నరలోగా 13 కోట్లు లాభాల్లోకి తెచ్చామన్నారు. యూనియన్లు ఎలక్షన్స్ కోసం సమ్మె చేపడతాయన్నారు. ఇది చిల్లర యూనియన్ల రాజకీయ సమ్మె అంటూ మండిపడ్డారు సీఎం కేసీఆర్‌. పీఎఫ్ సొమ్ము ప్రభుత్వం తీసుకుంటుందా అని ప్రశ్నించారు. ఆర్టీసీకి రూ.5వేల కోట్ల అప్పులున్నాయని చెప్పారు.

ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత యూనియన్లకు లేదా..?

ప్రైవేట్ ట్రావెల్స్ ఎందుకు లాభాల్లో ఉంటాయి? ఆర్టీసీ ఎందుకు నష్టాల్లో ఉంటుందని సీఎం ప్రశ్నించారు. ఆర్టీసీ విలీన డిమాండ్ అర్ధరహితం అన్నారు. ప్రతి ఆర్టీసీ బస్సుకు కి.మీకు రూ.13 నష్టం వస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ కంటే ముందు ఐదేళ్లలో ఆర్టీసీకి రూ.750 ఇస్తే..తాము వచ్చాక ఆర్టీసీ రూ.4,250 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఈ ఏడాది కూడా రూ.450 కోట్లు ఇచ్చామన్నారు. సంస్థను కాపాడుకునే బాధ్యత కార్మికులపై లేదా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్‌.

ఆర్టీసీ కార్మికులది అనవసరమైన పంథా..!

తెలంగాణలో దసరా పండుగ చాలా ముఖ్యమన్నారు. డబ్బులు వచ్చే సమయంలో సమ్మెకు వెళ్లారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్లు కార్మికుల గొంతు కోస్తున్నాయని చెప్పారు. ఆర్టీసీ యూనియన్లు, కార్మికులు అనవసరమైన పంథా ఎంచుకున్నారని విమర్శించారు. ఆర్టీసీ ఎవరూ కాపాడలేరని..దాని పనైపోయిందని చెప్పారు. ప్రైవేట్ పర్మిట్లు ఇవ్వొచ్చని మోదీ చట్టం తెచ్చారని..సెప్టెంబర్ 1 నుంచి చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. ఒక్క సంతకం పెడితే 6, 7 బస్సులు రోడ్డు పైకి వస్తాయన్నారు కేసీఆర్‌. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరొచ్చు అన్నారు. స్వచ్ఛందంగా చేరిపోవాలని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఆర్టీసీ కేసీఆర్ జాగీర్ కాదు: అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీ గురించి సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పందించారు. ఆర్టీసీ ఎవరి జాగీరు కాదు అన్న ఆయన.. ఆర్టీసీ ఆస్తుల రక్షణ కోసమే సమ్మె చేపట్టామన్నారు. కేసీఆర్‌కు ఎప్పుడూ ఎన్నికల ధ్యాసేనని అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అన్నారు.. ధనిక రాష్ట్రం అని చెప్పిన తెలంగాణ మూడేళ్లలోనే నష్టాల్లోకి వచ్చిందా?.. అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రశ్నించారు. యూనియన్లు అస్తిత్వం కోల్పోతే ఇంత పెద్ద సమ్మె ఎలా జరుగుతుందన్నారు. యూనియన్లు ఉన్నాయి కాబట్టే ఆర్టీసీ ఆస్తులు ఉన్నాయని చెప్పారు. ఆర్థిక మాంద్యం ఒక్క తెలంగాణలోనే కాదు ప్రపంచం అంతా ఉందన్నారు. మావి గొంతమ్మ కోరికలు కావని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీలో 3 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు . ఆర్టీసీ బతికితే ఆ ఉద్యోగాలు మన పిల్లలకే కదా అని అశ్వత్థామ రెడ్డి చెప్పారు. సమర భేరీకి అన్ని వర్గాలు తరలివచ్చేలా చూడాలని ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. ఉద్యోగాలు తీసేసేందుకు ఫాంహౌజ్‌లో పాలేర్లం కాదని.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమ నేతలమన్నారు. ఇష్టం వచ్చినట్లు చేస్తే కోర్టులు చూస్తూ ఉరుకోవన్నారు. సీఎం మాటలకు ఎవరూ భయపడవద్దని.. ఎవరూ ధైర్యం కోల్పోవద్దని, అంతిమ విజయం మనదేనని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story