విలేఖరికి కేసీఆర్ ప్రశ్న.. ఉండమంటావా పొమ్మంటావా?

By అంజి  Published on  26 Jan 2020 5:41 AM GMT
విలేఖరికి కేసీఆర్ ప్రశ్న.. ఉండమంటావా పొమ్మంటావా?

మామూలుగా కేసీఆర్ “అల వైకుంఠపురమ్ములో నగరిలో ఆ మూల సౌధాగ్రంబున” ఉంటారు. ఎవరికీ కనిపించరు. వినిపించరు. కానీ ఎన్నికల్లో పార్టీ గెలిచిన తరువాత మాత్రం ఆయన తెలంగాణ భవనంలో దర్శనమిస్తారు. చిరునవ్వులు పూయిస్తారు. సరదాగా తాను మాత్రమే విసరగలిగే చెణుకులు, ఛలోక్తులతో వాతావరణాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా మార్చేస్తారు. నెలల పాటు బయటకి రాకపోయినా పాత పరిచయాలను పలకరిస్తూ, పరామర్శిస్తూ అందనివాడైనా అందరివాడుగా నిలుస్తారు. అదే కేసీఆర్ స్పెషాలిటీ.

మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం తరువాత కూడా ఆయన తెలంగాణ భవనంలో దర్శనమిచ్చారు. తనదైన శైలిలో వ్యవహరించారు.

“కేటీఆర్ ను ఎప్పుడు ముఖ్యమంత్రి చేస్తారు” అని ఒక విలేఖరి ప్రశ్నించగా “నా ఆరోగ్యం అద్భుతంగా ఉండగా నా పదవిని వదులుకొమ్మని ఎందుకు చెబుతున్నావు? నేను సరిగ్గా పనిచేయడం లేదా? “ అని ఛలోక్తి విసిరారు.

అప్పటికే సిగ్గుల మొగ్గ అయిపోయిన ఆ విలేఖరికి “నన్ను పంపించేయడానికి ప్లాన్లు ఏవైనా వేస్తున్నావా?” అని ఆయన మరో చురక అంటించారు. “ఈ మధ్యే కొద్దిపాటి అనారోగ్యంతో నేను ఆస్పత్రికి వెళ్లాను. వాళ్లు నా పై అన్ని రకాల టెస్టులు నిర్వహించారు. అందులో నా ఆరోగ్యం పరమాద్భుతంగా ఉందని తేలింది. ఇప్పుడు చెప్పండి నేనేం చేయాలో?” అని ఆయన అనేసరికి నవ్వుల పువ్వులు పూశాయి.

“కొందరు నాకు ఏదేదో అయిపోయిందని ఊహాగానాలు చేస్తున్నారు. కానీ వారు ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను” అని ఆయన అన్నారు.

“తెలంగాణను సాధించేందుకు అన్ని అడ్డంకులను అధిగమించి అలుపెరగని పోరాటం చేశాను. ఆ తరువాత మిడ్ మానేరులో నిండుగా నీరు ఉన్న దృశ్యాన్ని చూశాను. అది చూసి నేను ఆనందంతో ఉప్పొంగిపోయాను” అని కేసీఆర్ అన్నారు. తాజా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ తన అఖండ విజయపరంపరను కొనసాగించింది. పది మున్సిపాలిటీల్లో తొమ్మిదింటిని కైవసం చేసుకుంది. ఉత్తరరాంధ్రలోని దాదాపు అన్ని మున్సిపాలిటీలను గెలుచుకుంది. రెండో స్థానంలో బిజెపి, కాంగ్రస్ లకు బదులుగా టీఆర్ ఎస్ రెబెల్సే ఉండటం గమనార్హం.

Next Story