క‌రోనా నివార‌ణ చ‌ర్య‌లు, ప్ర‌భావిత రంగాల‌ ‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2020 5:20 PM IST
క‌రోనా నివార‌ణ చ‌ర్య‌లు, ప్ర‌భావిత రంగాల‌ ‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌

మత్స్యకారులు రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత వారికి రూ.2 వేల చొప్పున ఇవ్వాలని సీఎం‌ జగన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్‌-19 నివారణ చర్యలు, ప్రభావిత రంగాల ప‌రిస్థితులపై సీఎం స‌మీక్ష నిర్వ‌హించారు. క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరాలు అందించారు.

గుజరాత్‌ నుంచి తెలుగు మత్స్యకారులను తిరిగి స్వస్థలాలకు తీసుకు వస్తున్న అంశంపై సీఎం వివ‌రాలు కోర‌గా.. 4,065 మందికి పైగా స్వస్థలాలకు బయల్దేరారని, రవాణా ఖర్చులు, భోజనం, దారి ఖర్చులు అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని అధికారులు తెలిపారు. వ‌చ్చిన మ‌త్స్య‌కారులంద‌రికి రూ.2వేలు ఇవ్వాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో న‌మోదైన కేసులు, తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై సీఎం స‌మీక్షించారు. గడచిన 24 గంటల్లో 73 కేసులు నమోదయ్యాయని, గుంటూరులో 29 కేసులు న‌మోదు అవ్వ‌గా.. అందులో 27 కేసులు ఒక్క నర్సరావుపేటకు చెందినవేనని అధికారులు తెలిపారు. అక్కడ పెద్ద ఎత్తున కంటైన్‌మెంట్‌ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు

24 గంటల్లో 7,727 పరీక్షలు ప‌రీక్ష‌లు చేశామ‌ని, ఇందులో 70శాతం వరకూ పరీక్షలు రెడ్‌జోన్లలోనే చేశామని తెలిపారు. ఇప్పటివరకూ 88,061 కరోనా టెస్టులు, ప్రతి మిలియన్ జనాభాకు 1649 పరీక్షలు చేశామని అధికారులు సీఎంకు వివ‌రించారు. అదే విధంగా క్లస్టర్ల వారీగా కూడా వెరీ యాక్టివ్, యాక్టివ్, డార్మంట్‌ క్లస్టర్లు గుర్తించామని, గడచిన 5 రోజుల్లో కేసులు నమోదైన క్లస్టర్లను వెరీ యాక్టివ్‌ క్లస్టర్లుగా పరిగణిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం రిమ్స్‌లో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో ట్రయల్‌ టెస్టులు ప్రారంభం అయ్యాయ‌ని, ఒంగోలు, నెల్లూరులో ల్యాబ్ ఏర్పాటున‌కు ముమ్మ‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని అధికారులు పేర్కొన్నారు. శనివారం నాటికి ఈ మూడు కొత్త ల్యాబ్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు.

టెలిమెడిసిన్‌ పరీక్షపై సీఎం నిశిత సమీక్ష

టెలిమెడిసిన్ ప‌రీక్ష‌పై సీఎం నిశితంగా స‌మీక్షించారు. టెలీమెడిసిన్ కు కాల్ చేసిన వారికి అదే రోజు మందులు అందించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వాడు‌కొని టెలిమెడిసిన్‌ వ్యవస్థ మరింత సమర్థవంతంగా ప‌నిచేసేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. జిల్లాకు ఏర్పాటు చేస్తున్న ముగ్గురు జేసీల్లో ఒకరికి టెలిమెడిసిన‌ఖ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. కుటుంబ స‌ర్వే ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 12,247 ప‌రీక్ష‌లు చేశామ‌ని, మిగిలిన వారికి కూడా 3 రోజుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.

వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల కొనుగోలుపై స‌మీక్ష‌..

వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుపై సీఎం స‌మీక్షించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఏ పంటలోనైనా రైతుల వద్ద నుంచి ఎక్కువే కొనుగోలు చేశామని సీఎం జగన్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొక్కజొన్నను కూడా సేకరిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మార్కెట్లో ధరల స్థిరీకరణ పరిస్థితులు చోటుచేసుకున్నాయని అధికారులు అన్నారు. ఈ క్రాపింగ్, ఫాంగేట్, టోకెన్ల పద్ధతిద్వారా కొనుగోలు తదితర చర్యలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గాలివాన కార‌ణంగా పంట‌లు దెబ్బ‌తిన్న ప్రాంతాల్లో వెంట‌నే స‌ర్వే చేసి రైతుల‌ను ఆదుకోవాల‌ని సీఎం ఆదేశించారు.

Next Story