ఏపీకి ప్రత్యేక హోదా.. జగన్ కొత్త మాట

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2020 12:14 PM GMT
ఏపీకి ప్రత్యేక హోదా.. జగన్ కొత్త మాట

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తమకు భారీ మెజారిటీ ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆయన కోరినట్లు 25కు 25 మంది ఎంపీలను గెలిపించకపోయినా.. వైకాపా నుంచి 23 మందిని పార్లమెంటుకు పంపించారు ఆంధ్రా ఓటర్లు. ఇక్కడ ఏపీలో భారీ మెజారిటీతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అందించారు. కానీ ఎన్నికల్లో గెలిచాక ఏపీ సీఎం ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు. ఒకట్రెండు సందర్భాల్లో మోడీ సర్కారును డిమాండ్ చేయడం కాకుండా హోదా కోసం అభ్యర్థించారు. ఆ తర్వాత దాని ఊసే ఎత్తట్లేదు. ఐతే తాజాగా జగన్ తనకు తానుగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. మేధో మథనం సదస్సులో భాగంగా ‘మన పాలన-మీ సూచన’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ పరిశ్రమలు, పెట్టబడుల అంశంపై చర్చించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదాఇస్తామని కేంద్రం ఇవ్వలేదని.. హోదా వస్తే ఏపీకి ఎన్నో కంపెనీలు వచ్చేవన్నారు.. అలాగే పన్నులు, జీఎస్టీ వంటి మినహాయింపులు వచ్చి ఉండేవన్నారు.

వైకాపాకు 22 ఎంపీ సీట్లతో పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించినప్పటికీ.. కేంద్రంలో మోడీ సర్కారు పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిందన్నారు. కేంద్రంలో బీజేపీకి మెజార్టీ రాకపోయి ఉంటే ప్రభుత్వ ఏర్పాటు కోసం తమపై ఆధారపడి ఉండేదని, అప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్‌ చేసేవాళ్లమని జగన్న అన్నారు. భవిష్యత్‌లో ఇతర పార్టీలపై కేంద్రంలో ఆధారపడే పరిస్థితి వస్తుందని.. అప్పుడు ప్రత్యేక హోదాను నెరవేర్చాలని డిమాండ్ చేస్తామని జగన్ చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం.. నాలుగేళ్ల పాటు కేంద్రంలో ఉన్న బీజేపీతో కలిసి అధికారం పంచుకున్నప్పటికీ ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయిందని విమర్శించారు జగన్. టీడీపీ హయాంలో ఎన్నో కంపెనీలు, సంస్థలు ఏపీకి వస్తున్నాయని అబద్ధాలు చెప్పారని.. గ్రాఫిక్స్‌ చూపించి ప్రజలను మోసం చేశారని అన్నారు. గత ప్రభుత్వం కంపెనీలకు రూ.4వేల కోట్ల ప్రోత్సాహాకాలు పెండింగ్‌లో పెట్టిందని.. ఇలా చేసి ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్రస్థానమని ఎలా చెప్పుకున్నారని జగన్ మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టబడులకు సానుకూల వాతావరణం ఉందని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 1400 పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయని.. అలాగే మరో 20 ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని జగన్ చెప్పారు.

Next Story
Share it