'జగనన్న వసతి దీవెన' పథకం ప్రారంభం.. ఏ విద్యార్థులకు ఏంతంటే..?

By అంజి  Published on  24 Feb 2020 8:28 AM GMT
జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభం.. ఏ విద్యార్థులకు ఏంతంటే..?

విజయనగరం: వైసీపీ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూడుతోంది. తాజాగా పేద విద్యార్థులకు అండగా జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా విజయనగరంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా విజయనగరం జిల్లాకు వైఎస్‌ జగన్‌ వచ్చారు. కాగా ఆయనకు మంత్రులు, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీ చేరుకున్న సీఎం జగన్‌.. అయోధ్య మైదానంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం దివంగత సీఎం వైఎస్సార్‌ విగ్రహానికి సీఎం జగన్‌ పూల మాల వేశారు.

జగనన్న వసతి దీవెన పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 11.87 లక్షల మంది ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకం అమలుకు ఏడాదికి రూ.2,278 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు భోజనం, వసతి సదుపాయాల కింద ఆర్థిక సాయం చేస్తారు. డిగ్రీ ఆపై కోర్సుల వారికి రూ.20 వేలు, పాలిటెక్నిక్‌ రూ.15 వేలు, ఐటీఐ రూ.10 వేలు చొప్పున హాస్టల్‌, మెస్‌ చార్జీల కింద ప్రభుత్వం ఇస్తుంది. ఈ డబ్బులను విద్యార్థుల తల్లుల అకౌంట్‌లో వేయనున్నారు.

ప్రజలు సీఎం వైఎస్‌ జగన్‌ను తండ్రికి మించిన తనయుడిగా భావిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరంలో ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా పథకంతో జిల్లాలో వలసలు ఆగిపోయాయని అన్నారు. కంటి వెలుగు పథకం ద్వారా ఎంతో మంది కళ్లలో సీఎం జగన్‌ ఆనందం నింపారని ఎమ్మెల్యే కోలగట్ల పేర్కొన్నారు. సీఎం జగన్‌ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని కోలగట్ల విమర్శించారు. సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌, అయోధ్య మైదానం, దిశ పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 1500 మంది పోలీసులతో సీఎం జగన్‌ పర్యటనకు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story