స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన
By Newsmeter.Network Published on 23 Dec 2019 1:43 PM ISTముఖ్యాంశాలు
- మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తాం: సీఎం జగన్
- ఎన్నో ఏళ్ల స్టీల్ ప్లాంట్ కలను సాకారం చేశాం: జగన్
- గత ప్రభుత్వ పాలనకు.. మా పాలనకు ఇదే తేడా: సీఎం జగన్
కడప: వైసీపీ ప్రభుత్వం మరో నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఏటా 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టనున్నారు. స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యేక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. స్టీల్ ప్లాంట్ కోసం గండికోట రిజర్వాయర్ నుంచి రెండు టీఎంసీల నీటి సరఫరా చేయనున్నారు. ప్లాంట్ నిర్మాణం కోసం ఇప్పటికే 3,200 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైసీపీ ప్రభుత్వం ఇవాళ కీలక ఘట్టానికి తెర తీసింది. మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యం నిర్ణయించారు. రూ.15 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు స్టీల్‌ప్లాంట్‌కు టెంకాయ కొట్టారని జగన్ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల స్టీల్ ప్లాంట్ కలను సాకారం చేశామని.. గత ప్రభుత్వ పాలనకు.. మా పాలనకు తేడా ఇదేనన్నారు. స్టీల్ ప్లాంట్‌కు కావాల్సిన ముడిసరుకు కోసం ఎన్‌ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ముందడుగు వేశామన్నారు. ఆరు నెలలు తిరగకముందే స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామన్నారు. తన జీవితంలో మరిచిపోని ఘట్టమని సీఎం జగన్ పేర్కొన్నారు.
కాగా 2007లో బ్రాహ్మణి స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి వైఎస్ రాజశస్త్రఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం అప్పుడు 10,670 ఎకరాల భూమి సేకరించారు. రాజశేఖర్ రెడ్డి మరణంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో 2012లో నల్లారి కిరణ్‌కుమార్ సర్కార్ భూములను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత 2018 డిసెంబర్‌లో చంద్రబాబు స్టీల్ ప్లాంట్ పైలాన్ ఆవిష్కరించారు.