ఉదయం 11 దాటితే ఎవ్వరూ బయటకు రావొద్దు.. హెచ్చరిక

By అంజి  Published on  29 March 2020 10:44 AM GMT
ఉదయం 11 దాటితే ఎవ్వరూ బయటకు రావొద్దు.. హెచ్చరిక

అమరావతి: నిత్యావసరాల విషయమై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. నిత్యావసరాల కోసం సమయం సడలింపు ఇచ్చామని, పట్టణాలు, నగరాల్లో సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కుదించామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఒంటి గంట వరకు నిత్యావసరాలు కొనుగోలుకు వెసులుబాటు ఉంటుందన్నారు. నిపుణుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆళ్ల నాని తెలిపారు.

ప్రజలందరూ సహకరించాలని సీఎం జగన్‌ కోరారని అన్నారు. నిత్యవసరాలకు ఏ కొరత రాకుండా చేస్తాం, ఉదయం 11 గంటల తర్వాత ఎవ్వరూ బయటకు రావొద్దు, నిత్యావసర వస్తువుల బ్లాక్‌ మార్కెటింగ్‌ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి షాప్‌ వద్ద ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ ధరల పట్టికను విస్తృత ప్రచారం చేస్తామన్నారు. అధిక ధరలకు అమ్మే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు డీజీపీకి ఆదేశాలు ఇచ్చామన్నారు.

గ్రామ వాలంటీర్ల సర్వే మరింత పటిష్టంగా చేయాలని సీఎం ఆదేశించారని, ప్రతి ఇంటికి వెళ్లి లోతుగా పరిశీలన చేయాలని ఆళ్లనాని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవారికి అన్ని సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు. వారికి మంచి భోజనం అందించేందుకు ప్రత్యేక మెనూ తయారు చేశామన్నారు. షెల్టర్లు, సోప్‌, బ్రష్‌తో సహా అన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లాల్లోనూ అక్కడి మంత్రులు సమీక్షా చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారని వివరించారు. పట్టణాల్లో ప్రత్యేక చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. నిత్యావసరాలు, కూరగాయలు, పాలు రవాణాకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు.

నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు హెచ్చరించారు. ధరలు అందరికీ కనిపించేలా బోర్డులు పెట్టాలని, కాల్‌ సెంటర్‌ నెంబర్‌ కూడా పెట్టాలన్నారు. కష్ట కాలాన్ని వ్యాపారానికి వాడుకుంటాం అంటే కుదరని కన్నబాబు అన్నారు. నిత్యావసరాల స్టాక్స్‌ అంచనా వేసి కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఆక్వా పంట చేతికి వచ్చే సమయమైందని, కచ్చితంగా ప్రకటించిన రేట్లకు కొనుగోలు చేయాలని సూచించారు. 50 శాతం వర్కర్స్‌ని ప్రాసెసింగ్‌ యూనిట్లకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. అయితే అందరూ సామాజిక దూరం పాటించాలని మంత్రి కన్నబాబు సూచించారు. వ్యవసాయ అనుబంధ ప్రాసెసింగ్స్‌ యూనిట్స్‌కు కూడా వెసులుబాటు ఇస్తున్నామని చెప్పారు. వ్యవసాయ కూలీల రాకపోకలను అడ్డుకోవద్దని సీఎం జగన్‌ ఆదేశించారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. త్వరలో మొబైల్‌ మార్కెట్స్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

Next Story