అమరావతి: మండలి రద్దు దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తున్న మండలి మనకి అవసరమా అంటూ సీఎం జగన్‌ అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మేలు చేయని, సూచనలు, సలహాలు ఇవ్వని సభలు కొనసాగించాలి వద్దా అన్నది చర్చించాలన్నారు. శాసనసభను పొడిగించాలన్నారు. మండలి కొనసాగించాలో వద్ద నిర్ణయం తీసుకోవాలన్నారు.

పేద రాష్ట్రానికి ఏడాదికి రూ.60 కోట్లు భారంగా ఉన్న మండలి అవసరమా అంటూ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ని కోట్లు ఖర్చు చేసినా ప్రజలకు ఉపయోగపడటం లేదని సీఎం జగన్‌ అన్నారు. శాసనమండలి రాష్ట్రా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు. గతంలో శాసన సభలో చేసిన బిల్లులపై చర్చించటానికి పలు రంగాల నుంచి మేధావులు, పెద్దల సూచనలు, సలహాలు తీసుకోవడానికి మాత్రమే మండలి ఏర్పాటు చేశారని సీఎం జగన్‌ ఈ సందర్భంగాపేర్కొన్నారు. ప్రస్తుతం శాసన సభలోనే విద్యావంతులు, డాక్టరేట్లు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, ఇంజనీర్లు ఉన్నప్పుడు ఇక పెద్దల సభ అవసరమా అని సీఎం జగన్‌ అసెంబ్లీలో మాట్లాడారు. దేశంలో 28 రాష్ట్రాల్లో కేవలం ఆరు రాష్ట్రాల్లోనే మండలి ఉందన్నారు. మండలి అవసరమా అనే అంశంపై కొన్ని రోజులు అసెంబ్లీ జరిపి చర్చ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, రూల్స్‌ విరుద్ధంగా మండలి వ్యవహరిస్తోందని సీఎం జగన్‌ అన్నారు.

స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ మాట్లాడుతూ.. మండలి రద్దుపై విస్తృత అభిప్రాయం తీసుకొని ముందుకు వెళ్దామని సీఎం జగన్‌ అంటున్నారని, అలాగే చేద్దామని అన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.