ఏపీ అసెంబ్లీ స్పెషల్‌ సెషన్‌.. మండలి రద్దుపై చర్చ

By అంజి  Published on  27 Jan 2020 7:14 AM GMT
ఏపీ అసెంబ్లీ స్పెషల్‌ సెషన్‌.. మండలి రద్దుపై చర్చ

అమరావతి: అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్‌ ప్రవేశపెట్టారు. బీఏసీ సమావేశం అనంతరం ప్రారంభమైన సభలో మండలి రద్దుపై చర్చలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటు ప్రజల ఆకాంక్ష అని మంత్రి ఆళ్ల నాని అన్నారు. రాజధానిని తరలించడం లేదని సీఎం జగన్‌ చెప్పారన్నారు. చంద్రబాబు వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి కారణం ఆయనేనని ఆళ్ల నాని అన్నారు. హైదరాబాద్‌ మహానగరాన్ని కోల్పోయామన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. అసెంబ్లీ తీర్మానాలను మండలి వ్యతిరేకిస్తోందని.. చంద్రబాబు నీచ రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు. వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.

51 శాతం ప్రజలు తీర్పునిచ్చారని మంత్రి ధర్మాన అన్నారు. ప్రజలు తిరస్కరించిన టీడీపీ అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు. 67 దేశాల్లో మాత్రమే ఎగువ సభలు ఉన్నాయని మంత్రి ధర్మాన తెలిపారు. 101 దేశాల్లో పెద్దల సభలు లేవన్నారు. బ్రిటీషర్ల ప్రోత్సహంతోనే ఈ సభలు ఏర్పాటయ్యాయన్నారు. పెద్దలను గౌరవిస్తున్నామన్న పేరుతో దేశానికి కన్నం పెట్టే పని చేశారని ధర్మాన అన్నారు. బ్రిటీష్‌ వాళ్ల వైఖరిని మహాత్మాగాంధీ తీవ్రంగా తప్పుబట్టారని ధర్మాన గుర్తు చేశారు. ఇవి రాజకీయ పునరావాస కేంద్రాలని ఆనాడే విమర్శలు వచ్చాయన్నారు. ఇలాంటి అభివృద్ధి నిరోధక వ్యవస్థ మనకు అవసరమా అంటూ ధర్మాన చెప్పుకొచ్చారు. పెద్దల సభ తాత్కాలికమని డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆనాడే చెప్పారన్నారు. ఓడిపోయిన వాళ్లు ఆ సభల్లో కూర్చొని అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటీ అంటూ ధర్మాన వ్యాఖ్యనించారు.

పేద పిల్లల కోసం సీఎం జగన్‌ ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఎస్టీ, ఎస్సీలకు ప్రత్యేకంగా కమిషన్లు తెచ్చారన్నారు. అయితే పేద ప్రజలకు మేలు జరగకూడదని కొందరు కుట్ర చేస్తున్నారని మంత్రి పేర్ని సభలో మాట్లాడారు. ప్రజల గురించి చిత్తశుద్ధితో పని చేసే దమ్మున నేత సీఎం జగన్‌ అని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం కేవలం చేతబడుల కోసమేనన్నారు. ఎన్ని కుట్రలు పన్నిన్నా జగన్‌ కాలిగోటిని కూడా కదపలేరని మంత్రి పేర్ని వ్యాఖ్యనించారు.

అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం వీడియోను ప్రదర్శించారు. వీడియోలో 2004లో శాసనమండలిని రద్దు చేయాలని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మండలితో ప్రజలకు ఎలాంటి లాభం లేదని చంద్రబాబు అన్నారని మంత్రి పేర్ని తెలిపారు.

Next Story