సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన యూపీఎస్సీ.. అక్టోబర్ 4నే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
By తోట వంశీ కుమార్ Published on 30 Sep 2020 6:04 AM GMTఅక్టోబర్ 4న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు యూపీఎస్సీ అఫిడవిట్ సమర్పించింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని 20 మంది యూపీఎస్సీ ఆశావహులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు పరీక్షను వాయిదా వేయకపోవడానికి గల కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని యూపీఎస్సీని ఆదేశించింది. దీంతో యూపీఎస్పీ నేడు అఫిడవిట్‌ను దాఖలు చేసింది.
ఎట్టి పరిస్థితుల్లో పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది వాయిదా వేస్తే ఆ ప్రభావం వచ్చే ఏడాది జూన్ 27న జరిగే పరీక్షపై పడుతుందని పేర్కొంది. పరీక్షకు హాజరయ్యే వారంతా పట్టభద్రులు, ఆపైబడిన వారేనని.. వారంతా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు అపిడవిట్‌లో తెలిపింది. కొవిడ్ సహా అన్ని ప్రొటోకాల్స్ పరిగణనలోకి తీసుకొని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల కోసం రూ.50.30 కోట్ల వ్యయం అయినట్లు తెలిపింది. కాగా.. ఈ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.