ఇదీ పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ఉద్యమం అసలు స్వరూపం

By Newsmeter.Network  Published on  23 Dec 2019 7:01 AM GMT
ఇదీ పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ఉద్యమం అసలు స్వరూపం

ఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లు, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న వీధి పోరాటాలు స్వచ్ఛందం కాదా? ప్రజలు తమంతట తామే రావడం లేదా? వచ్చినా అది సహజమైన నిరసన ప్రదర్శన కాదా? దాని వెనుక ప్రళయాంతకమైన బుద్ధులున్న వారి ప్లాన్లు ఉన్నాయా? ఒక పథకం ప్రకారం అల్లరి చేయాలని తెరవెనుక చేతులు తోలుబొమ్మలను ఆడిస్తున్నాయా? కొన్ని ప్రత్యేక వర్గాలు, కొన్ని ప్రత్యేక వ్యూహాల ఆధారంగా ఈ దాడులకు పాల్పడుతున్నాయా.

అవుననే అంటున్నారు పోలీసులు. ఎన్నార్సీ సీఏఏలకు వ్యతిరేకంగా రోడ్డెక్కడం, హింస దౌర్జన్యాలకు పాల్పడటం, రాళ్ల దాడులు చేయడం ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని, సాధారణ ప్రజలు దీనికి దూరంగా ఉన్నా, కొన్ని వర్గాలు కావాలనే అల్లర్లకు పాల్పడుతున్నాయని నిఘావర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. సందుల్లో మాటు వేసి ఉన్నట్టుండి పోలీసుల మీద దాడి చేయడం, అక్షరం ముక్క రాని పిల్లలు ఇంగ్లీషులో ప్లకార్డులు పట్టుకోవడం, ఆ ప్లకార్డుల భాష అత్యంత ఆధునికంగా అమెరికా వాడికి అచ్చంగా అర్థమయ్యేలా ఉండటం, పోలీసుల మొహరింపు ఎక్కడ తక్కువగా ఉందో అక్కడ భారీ సంఖ్యలో మూకలను దించడం, ఏ సమయాల్లో పోలీసులు కాస్త విశ్రాంతిగా ఉంటారో చూసి అప్పుడే దాడి చేయడం వంటివి ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయి.

ఉత్తర ప్రదేశ్ లోని లక్నో, వారణాసి, మీరట్, బెహ్రాయిచ్, ఆగ్రా, ఫిరోజాబాద్, గోరఖ్ పూర్ లలో ఇదే తరహాలో అల్లర్లు జరిగాయి. వీటిలో 18 మంది మరణించారు. ఈ తరహా దారులన్నీ గెరిల్లా తరహా దాడులని, ఒక పథకం ప్రకారం వ్యూహాత్మకంగా దాడులు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. “ఇటుకలు విసిరి దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో జరుగుతోంది. ముఖ్యంగా పోలీసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే జరుగుతోంది. దాడులు చేసే వారు బెంగాలీలో మాట్లాడుతున్నారు. ఎలాంటి కారణమూ లేకుండా పోలీసులు, మీడియా ప్రతినిథులపైన దాడులు జరుగుతున్నాయి” అని ఉత్తరప్రదేశ్ ఐజీపీ ప్రవీణ్ కుమార్ చెబుతున్నారు.

వారణాసిలో ఎనిమిదేళ్ల పిల్లలకు ఇంగ్లీషు ప్లకార్డులు చేతికి ఇచ్చారు. వారంతా నిరక్షరాస్యులు. బడికి వెళ్లే స్తోమత లేని కుటుంబాలు. అంటే ఎవరో వారిని బలి పెట్టి తమ పబ్బం కడుపుకుంటున్నారన్న మాట. ఈ విషయాన్ని వారణాసీ ఎస్ ఎస్ పీ ప్రభాకర్ చౌదరి చెబుతున్నారు. ఇది భేలూపూర్ ప్రాంతంలో జరిగిన సంఘటన. వారణాసిలోని బజార్ దిహా ప్రాంతంలో భారత దేశాన్ని వ్యతిరేకిస్తూ, ఒక మతం వారిని రెచ్చగొడుతూ కరపత్రాలను పంచి, ప్రజలను వీదుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 70 మందిని అరెస్టు చేశారు. చాలా చోట్ల యువకులు, చిన్న పిల్లలే ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. పెద్దలు తెరచాటున దాగుంటున్నారు.

ఇదీ సీఏఏకి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్ల వాస్తవ స్వరూపమని పోలీసులు తెలియచేస్తున్నారు. వీరందరినీ రెచ్చగొడుతున్న వారు తెర చాటునే దాగున్నారని, తమ పబ్బం గడుపుకోవడానికి పిల్లలను ఎర వేస్తున్నారని పోలీసులు ధ్రువీకరిస్తున్నారు.

Next Story