అధికారులకు సీఎం యోగి కీలక ఆదేశాలు
By సుభాష్
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిరసనలతో పుకార్లు సృష్టిస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని యోగి అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. కొందరు ప్రజలు పౌరసత్వ సవరణ చట్టంపై లేనిపోని వదంతులు సృష్టిస్తున్నారని, అలాంటి వారిపై అధికారులు నిఘా ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ మేరకు అదనపు డైరెక్టరు జనరల్స్, కమిషనర్లు, ఐజీలు, డీఐజీలు, జిల్లా మెజిస్ట్రేట్లు, జిల్లా ఎస్పీలకు పలు సూచనలు చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం ఏ మతం, కులంపై వివక్ష చూపించదని, దీనిపై మత ప్రచారకులు, మౌల్వీలు, ఇతర సంస్థల ప్రతినిధులకు అవగాహన కల్పించాలని సీఎం యోగి సూచించారు. రాంపూర్, ప్రయాగరాజ్ నగరాల్లో హింసాకాండ చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ ను అమలు చేయాలని సీఎం కోరారు. 144 సెక్షన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రయాగరాజ్ నగరంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేయరాదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.