టీడీపీ సీనియర్‌ నేత నన్నపనేని ఇంటికి సీఐడీ నోటీసులు

By అంజి  Published on  29 Feb 2020 9:04 AM GMT
టీడీపీ సీనియర్‌ నేత నన్నపనేని ఇంటికి సీఐడీ నోటీసులు

ముఖ్యాంశాలు

  • టీడీపీ నేత నన్నపనేని ఇంటికి సీఐడీ నోటీసులు
  • సర్చ్‌ నోటీసు అంటించిన సీఐడీ అధికారులు
  • ప్రభుత్వానికి పూర్తి వివరాలు ఇస్తానన్న నన్నపనేని

విజయవాడ: కంచికచర్ల వ్యవసాయ మార్కెట్‌ మాజీ చైర్మన్‌, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంటికి సీఐడీ అధికారులు నోటీసులు అంటించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోలు విషయమై సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు వచ్చినట్టు సమాచారం. లక్ష్మీనారాయణ అల్లుడు దమ్మాలపాటి శ్రీనివాసరావు మాజీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌గా పని చేశారు. నన్నపనేని ఇంటికి సర్చ్‌ నోటీస్‌ అంటించి అధికారులు వెళ్లిపోయారు. అధికారులు వచ్చే సమయానికి లక్ష్మీనారాయణ కుటుంబీకులు అందుబాటులో లేరు. అధికారులను లక్ష్మీనారాయణ సెక్యూరిటీ ఇంటిలోకి అనుమతించలేదు. లక్ష్మీనారాయణ కుమారుడు సీతారామరాజు.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో పాటు, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు సబ్‌ కాంట్రాక్టర్‌గా ఉన్నారు.

సీఐడీ నోటీసులపై నన్నపేనని స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తనకు 37 ఎకరాల భూమి, ఇల్లు ఉందన్నారు. తాను స్వయంకృషితో పైకొచ్చానని చెప్పారు. సబ్‌ కాంట్రాక్టులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడం తప్పా అంటూ ప్రశ్నించారు. టీడీపీలో ఉన్నా కాబట్టే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనకు ఇళ్లు వదిలిపెట్టి పోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పూర్తి వివరాలు ఇస్తానని చెప్పారు.

ఇదిలా ఉంటే టీడీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలపై వైసీపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సిట్‌ ప్రత్యేకాధికారి రఘురామిరెడ్డి టీమ్‌.. నిన్న విజయవాడలో మెరుపు దాడులు చేసింది.

Next Story
Share it