చిరు.. ది స్టేట్స్‌మన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 May 2020 8:49 AM ISTమెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు సెలవు చీటీ ఇచ్చేశాక చాలా స్వేచ్ఛగా ఉంటున్నారు. తనకు రాజకీయాలు పడవనో.. లేక తానే రాజకీయాలకు పనికి రాననో.. ఇలా ఏదో ఒక నిర్ణయానికి వచ్చేసిన చిరు.. అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల్ని కలవడంలో, వారిని గౌరవించే, పొగిడే విషయంలో అసలేమాత్రం మొహమాటపడట్లేదు. కాలం కలిసొస్తే తాను కూడా వాళ్ల స్థాయిలో ఉండాల్సిన వాడినే అన్న భావన ఆయనకు అసలేమాత్రం ఉన్నట్లు లేదు. అలాంటి ఫీలింగే ఉంటే గత ఏడాది అమరావతికి వెళ్లి మరీ ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేవాడు కాదు. పూర్తిగా సినిమా వ్యక్తిగా మారిపోయిన ఆయన.. తన, పరిశ్రమ మంచి కోసం రాజకీయ నాయకుల్ని మెప్పించే విషయంలో ఎంతమాత్రం మొహమాట పడట్లేదు.
తెలంగాణలో లాక్ డౌన్ సడలింపుల్ని వివిధ రంగాలకు ఇచ్చింది కానీ.. సినీ పరిశ్రమ విషయంలో మాత్రం మౌనం వహించిన తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సినీ పెద్దలందరినీ వెంటబెట్టుకుని ముందుగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలిశారు చిరు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు. ఇలా నేరుగా వెళ్లి ప్రభుత్వ పెద్దల్ని కలిస్తే వాళ్లు పరిశ్రమ పట్ల సానుకూలంగా వ్యవహరించకుండా ఎలా ఉంటారు. దీంతో జూన్ ఆరంభం నుంచి షూటింగులు మొదలుపెట్టుకోవడానికి అనుమతులిచ్చారు.
ఐతే సినిమా వాళ్లు ఎప్పుడూ తెలంగాణ ప్రభుత్వం చుట్టూనే తిరుగుతున్నారని.. ఏపీ సర్కారును పట్టించుకోవట్లేదనే ఫీలింగ్ అక్కడి వాళ్లలో ఉంది. ఈ నేపథ్యంలో చిరు.. బేషజాలకు పోకుండా ఏపీ సీఎంకు ఫోన్ చేశారు. ఆయన ఇగోను కూడా శాటిస్ఫై చేశారు. దీంతో పరిశ్రమకు సహకరించడానికి జగన్ కూడా ఓకే అన్నారు. మొత్తంగా ఈ విషయంలో చిరు ఒక స్టేట్స్‌మన్ లాగా వ్యవహరించాడన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.