మెగాస్టార్‌తో జతకట్టనున్న రాములమ్మ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 May 2020 3:39 PM ISTఆన్ స్క్రీన్ పై ది బెస్ట్ కపుల్ ఎవరంటే వినిపించే పేర్లలో ఎక్కువశాతం చిరంజీవి - విజయశాంతి ఉంటారు. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు అంత బాగా పాపులర్ అయ్యాయి. ఈ జోడి జతకట్టిందంటే ఆ సినిమా ఇక ఖచ్చితంగా హిట్ అయిపోయినట్లే. అలా ఫిక్స్ అయ్యే దర్శకులు వీరిద్దరినీ చాలా సినిమాల్లో జోడీగా చూపించారు. మరీ ముఖ్యంగా గ్యాంగ్ లీడర్, స్వయంకృషి, ఛాలెంజ్, పసివాడి ప్రాణం, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, మెకానిక్ అల్లుడు సినిమాలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. కానీ ఒక సినిమా విషయంలో మాత్రం విజయశాంతి - చిరంజీవికి మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయి. ఆ సినిమా నా వల్ల హిట్ అయింది అంటే నా వల్లే హిట్ అయిందంటూ ఇద్దరూ ఇగోతో వాదులాడుకోవడంతో..మెకానిక్ అల్లుడు (1993) తర్వాత ఇప్పటి వరకూ మళ్లీ జత కట్టలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. 18 ఏళ్లపాటు ఈ స్నేహితులు దూరమయ్యారు.
సినిమాల్లో కలిసి నటిస్తున్న సమయంలో ఇద్దరి కుటుంబాలు చాలా కలిసి మెలిసి ఉండేవి అప్పట్లో. ఇదంతా చూస్తోన్న సినీ వర్గాలు ఊరికే ఉంటాయా మరి. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారన్న పుకార్లు కూడా బాగా వినిపించాయి. దాదాపు అందరూ ఇదే అనుకున్నారు కానీ..తామిద్దరం మంచి స్నేహితులమే అని తేల్చి చెప్పేశారు. ఇక ఆ తర్వాత తెలిసిందే..అభిప్రాయ బేధాలతో ఒకరికొకరు దూరమయ్యారు.
సరిలేరు నీకెవ్వరుతో విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్
ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరుతో విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఈ సినిమాలో విజయశాంతి మహేష్ కు తల్లికాని తల్లి క్యారెక్టర్ లో జీవించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫంక్షన్ లో అలనాటి ప్రాణ స్నేహితులు మళ్లీ కలుసుకున్నారు. ఈ వేదిక మీదే చిరంజీవి విజయశాంతితో కలిసి మళ్లీ సినిమా చేయాలని ఉంది అని అన్నారు. అన్నదే ఆలస్యం..ఇప్పుడు వీరిద్దరూ ఓ సినిమాలో సందడి చేయనున్నారట.
మళయాళంలో మంచి విజయాన్నందుకున్న లూసిఫర్ కు రీమేక్ గా దర్శకుడు సుజిత తీయబోతున్న చిత్రంలో విజయశాంతి కీలకపాత్ర పోషించనున్నారని టాక్. ఈ మేరకు ఇప్పటికీ చిరంజీవి కూడా విజయశాంతితో మాట్లాడినట్లు తెలుస్తోంది. మళయాళ లూసిఫర్ చిత్రంలో మంజు వారియర్ పాత్రను తెలుగులో విజయశాంతి పోషించనున్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇదే నిజమైతే ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులను మళ్లీ ఇన్నాళ్లకు తెరపై చూసే అవకాశం లభిస్తోంది ప్రేక్షకులకు. ఈ జోడి జతకట్టిందంటే అది ఖచ్చితంగా హిట్టే కదా..