కరోనా వైరస్‌ వ్యాప్తి కాకుండా సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజా సహకారం అవసరమని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. తన సినిమా షూటింగ్‌ను తక్షణమే వాయిదా వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది, కరోనా వైరస్‌పై మరింత అప్రమత్తత అవసరమన్నారు.

కరోనా మహమ్మారి నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్విముఖ వ్యూహాలను అవలంభిస్తున్నాయని అన్నారు. కరోనా సోకిన వారికి తగిన చికిత్స అందించడం, వైరస్‌ వ్యాప్తి కాకుండా జనాలు గుమిగూడకుండా క్రీడలను వాయిదా వేయడం, మాల్స్‌, సినిమా హాల్స్‌ మూసివేయడం, స్కూల్స్‌, కాలేజీలకు సెలవులు ప్రకటించడం తదితర చర్యలు తీసుకోవడం ముదావహం అన్నారు. కరోనా నియంత్రణ బాధ్యత ప్రభుత్వాలకే వదిలేయకుండా అందరూ భాగస్వాములు కావాలని చిరంజీవి అన్నారు. అందరిలో చైతన్యం కలిగించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అందరిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నందుకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ కూడా కొన్ని ముందస్తు నివారణ చర్యలు ప్రారంభించినట్టు తెలిసిందన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన నెల్లూరు జిల్లాలో స్కూల్స్‌, మాల్స్‌, థియేటర్స్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌ మూసివేయడం వల్ల వైరస్‌ వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకున్నట్లైందని అన్నారు.

Also Read: బ్రేకింగ్‌: ఒక్క రోజులోనే 1500 కరోనా కేసులు 

కాగా సినిమా షూటింగ్స్‌లో కూడా పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు పని చేయాల్సి ఉంది. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 10 నుంచి 15 రోజుల పాటు షూటింగ్‌ను వాయిదా వేస్తే బాగుంటందని తాను భావిస్తున్నానని తెలిపారు.

ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు కనుక ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికి కరోనా వైరస్‌ని నియంత్రణ చేసి ఉద్యమంలో సినీరంగం కూడా పాలు పంచుకోవాలని కోరుతున్నానని, అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు.

Also Read: కరోనా ఇక జాతీయ విపత్తు..

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.