చైనా చేతిలో భయంకర మారణహోమం?!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 2:54 PM GMT
చైనా చేతిలో భయంకర మారణహోమం?!!

శాంతి శాంతి అంటూనే అశాంతి రాజేస్తున్నారు. ఒక బాంబును మించి మరో బాంబును తయారు చేస్తూ యుద్ధ మేఘాలు సృష్టిస్తున్నారు. అణ్వాయుధాల స్థాయిలో విధ్వంసం సృష్టించే మారణాయుధాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే అమెరికా, రష్యా దేశాలు భయంకర మారణహోమం కలగచేసే బాంబులను తయారు చేయగా, తాజాగా ఆ జాబితాలో చైనా కూడా చేరింది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ను తల దన్నే శక్తివంతమైన బాంబును చైనా రూపొందించింది. ఆయుధ పరిజ్ఞానం పెంపు, ఆయుధాల తయారీ, అస్త్రాలను సమకూర్చుకోవడంలో వేగంగా ముందుకెళ్తున్న చైనా, ఇప్పుడు సొంతంగా పెను విధ్వంసం సృష్టించే బాంబును అభివృద్ధి చేసింది. ఆ భారీ బాంబును ప్రయోగాత్మకంగా పరీక్షించి చూసింది. సైజులో చిన్నగా ఉన్న ఆ బాంబ్, పేలిన వెంటనే భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించింది.

భయంకర మారణహోమం సృష్టించే ఆ బాంబ్‌ను చైనీస్ వర్షన్ ఆఫ్ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌గా పేర్కొంటున్నారు. చైనా రక్షణ ఉత్పత్తుల్లో అగ్రగామి సంస్థ ఐన చైనా నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేషన్ లిమిటెడ్‌, ఆ బాంబును తొలి సారిగా ప్రదర్శించింది. హెచ్-6-కె బాంబర్ ద్వారా ఆ బాంబును ప్రయోగిస్తే భయంకర మైన పేలుడు సంభవించింది. అణ్వాయుధాల తర్వాత ఈ బాంబే అతి శక్తివంతమైనదని చైనా అధికార మీడియా పేర్కొంది. ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే సెకన్ల వ్యవధిలో సర్వనాశనం జరుగుతుందని అభివర్ణించింది. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, రష్యా మధ్య తీవ్రమైన ఆయుధ పోటీ జరుగుతోంది. ఆ రెండు దేశాలతో సమానంగా ఆయుధ వ్యాపారం చేయాలన్నది చైనా ఆలోచన. పైగా, అమెరికా వాయుసేనకు దీటుగా తమ వాయుసేనను తీర్చి దిద్దాలని, అత్యంత శక్తివంతమైన అస్త్రాలను చైనా ఆర్మీ అమ్ముల పొదిలో చేర్చాలన్నది జిన్‌పింగ్ ప్రభుత్వ వ్యూహం. అందులో భాగంగానే చైనీస్ వర్షన్ ఆఫ్ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌కు రూపకల్పన చేశారు.

మదర్ ఆల్ బాంబ్స్

మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అన్న పేరు మొదటిసారిగా అమెరికా నుంచే వెలువడింది. దాదాపు దశాబ్దన్నర కాలం క్రితమే అణ్వాయుధేతర భారీ బాంబును అగ్రరాజ్యం రూపొందించింది. మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్-MOABగా పిలుచుకునే GBU-43ని 2003లోనే అమెరికా సైనిక వ్యవస్థలోకి చేర్చారు. ఐతే, ఏప్రిల్ 2017వరకు ఆ బాంబు ఆయుధాల స్టోరేజీలోనే ఉండిపోయింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఐసిస్ ఉగ్రవాద స్థావరాలపై ప్రయోగించినప్పుడు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ప్రత్యేకతలు బయటకొచ్చాయి. అమెరికా రూపొందించిన GBU-43 11 అడుగుల పొడవు, 30 టన్నుల బరువు ఉంటుంది. ఈ భారీ బాంబును తీసుకు వెళ్లాలంటే అతిపెద్ద రవాణా విమానాలే కావాలి. 2017లో ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలను సమూలంగా నాశనం చేయడానికి జీబీయూ-43ని ప్రయోగించారు. ఆ బాంబు దెబ్బకు ఐసిస్ క్యాంపులు తునాతునకలయ్యాయి.

ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్

ఆయుధాల తయారీలో అమెరికాతో పోటీ పడుతున్న రష్యా, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌కు దీటుగా భారీ బాంబును తయారు చేసింది. ఆ అస్త్రానికి ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పేరు పెట్టింది. ఇది కూడా పెను విధ్వంసం సృష్టించే అణ్వాయుధేతర ఆయుధమే. అమెరికా, రష్యాలతో పోలిస్తే చైనా తయారు చేసిన MOAB, సైజులో తక్కువగా ఉంటుంది. రెండు ఇంజిన్లు ఉన్న హెచ్-6-కె జెట్ విమానాల్లోనూ ఈ బాంబును తరలించవచ్చు. శత్రు దుర్భేద్యమైన కోటలు, భూ ఉపరితల లక్ష్యాలు, రక్షణ స్థావరాలను సమూలంగా తుడిచిపెడుతుంది.

Next Story