చైనాలో కార్చిచ్చు.. 19మంది మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 April 2020 6:05 AM GMT
చైనాలో కార్చిచ్చు.. 19మంది మృతి

కళ్ళముందు పుట్టిన కరోనా ఇంకా కరిగిపోనే లేదు చైనాలో నైరుతి ప్రాంతానికి మరో ప్రమాదం ముంచుకొస్తోంది కార్చిచ్చు రూపంలో. సిచువాన్‌ ప్రావిన్స్‌లో వున్న జిచాంగ్‌ నగర సమీపంలోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రగులుతోంది. ఈ కార్చిచ్చులో 18మంది అగ్నిమాపక సిబ్బంది, ఒక ఫారెస్ట్‌ గైడ్‌ ప్రాణాలు కోల్పోయారని సిచువాన్‌ ప్రావిన్షియల్‌ ప్రభుత్వం ప్రకటించింది.

స్థానిక అటవీ ప్రాంతం నుండి వెలువడుతున్న అగ్నిజ్వాలలతో ఆకాశం నారింజ రంగులోకి మారింది. నగరంలోని భారీ భవనాలు, రోడ్లపై కమ్ముకున్న దట్టమైన పొగతో కూడిన దృశ్యాలను ఒక స్థానిక టీవీ నెట్‌వర్క్‌ తన వార్తా కథనాలలో ప్రసారం చేసింది. జిచాంగ్‌ అనే నగర సమీపంలోని అటవీ ప్రాంతాలలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.

ఈ మంటలను అదుపు చేసేందుకు దాదాపు 140కి పైగా అగ్నిమాపక యంత్రాలు, నాలుగు హెలీకాప్టర్లతో పాటు దాదాపు 900 మంది అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించినట్లు అధికారులు చెప్పారు. ఈ మంటలను కట్టడి చేసేందుకు దాదాపు 2 వేల మందికి పైగా ఎమర్జెన్సీ వర్కర్లు హౌరాహౌరీ పోరాడుతున్నారని, దాదాపు 1,200 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు వివరించారు.

Next Story