ఏపీలో 63కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

By రాణి  Published on  1 April 2020 4:59 AM GMT
ఏపీలో 63కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రెండ్రోజుల క్రితం వరకూ 21 గా ఉన్న కరోనా బాధితుల సంఖ్య బుధవారానికి 63కి పెరిగింది. అంటే కేవలం రెండ్రోజుల వ్యవధిలో 40కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా నమోదైన కేసుల్లో చాలా వరకూ ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారే అధికం. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 16 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 14, విశాఖలో 10, గుంటూరులో 9, కృష్ణా 5, తూర్పు గోదావరి 4, అనంతపురం 2, చిత్తూరు, నెల్లూరు, కర్నూల్ జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 17 కేసులు నమోదవ్వగా..మంగళవారం మరో 21 కేసులు నమోదయ్యాయి.

Also Read : ఏపీలో ఆ ఒక్క జిల్లాలో ఒకే రోజు 14 కరోనా కేసులు..!

మార్చి 10వ తేదీన ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు హాజరైన విషయం సోమవారం వెలుగుచూసింది. ఈ ప్రార్థనలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో మతస్తులు హాజరైనట్లు తెలుస్తోంది. సుమారు 13 దేశాల నుంచి 300 మంది మత పెద్దలు వీసా నిబంధనలు ఉల్లంఘించి మరీ మర్కజ్ ప్రార్థనలకు హాజరయ్యారు. వారి ద్వారానే కరోనా తీవ్ర స్థాయిలో వ్యాప్తికి కారణమైనట్లు సమాచారం. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ నిజాముద్దీన్ ను మొదలుపెట్టారు. 10వ తేదీ ముందు ఢిల్లీ వెళ్లిన వారి వివరాలను రైల్వే శాఖ, ఎయిర్ పోర్టుల నుంచి సేకరించి వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు క్రైం బ్రాంచ్ పోలీసులు. దయచేసి ఢిల్లీ వెళ్లొచ్చిన వారు తమంతట తాముగా బయటికి రావాలంటూ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. కరోనా సోకిన వారెవరైనా ఉంటే..వారి ద్వారా కరోనా సమూహ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఇళ్లలో ఉన్న వారికి కరోనా లక్షణాలున్నా లేకపోయినా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లాలని సూచిస్తున్నారు.

Also Read :ఈ రోజు నుంచి ఆ బ్యాంక్‌లు కనిపించవు.!

Next Story
Share it