భారత్ లో ప్రముఖులపై మహా కుట్ర...చైనా దుస్సాహసం
By సుభాష్ Published on 14 Sep 2020 6:08 AM GMTమనదేశంలోని అత్యంత ప్రముఖులపై చైనా నిఘా వ్యవస్ధను ఏర్పాటు చేసిందా ? అవుననే అంటోంది ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం. కథనం ప్రకారం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి+రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, వ్యాపార దిగ్గజాలు, సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్, శాస్త్రజ్ఞులు, సినీ సెలబ్రిటీలు తదితరులపై డ్రాగన్ తన నిఘా వ్యవస్ధను ఉపయోగించినందన్న కథనం సంచలనంగా మారింది. అనేక రూపాల్లో సుమారు 10 వేల మందిపై చైనా తన నిఘా వ్యవస్ధను 24 గంటలూ కన్నేసి ఉంచిందన్న విషయం బయపడింది.
చైనాకు చెందిన అనేక యాప్ లు మనదేశంలో కోట్లాదిమంది ఉపయోగిస్తున్నారు. బైదూస్, టిక్ టాక్ లాంటి అనేక సోషల్ మీడియా యాప్స్ వాడాలని అనుకున్న వాళ్ళు వ్యక్తిగత సమాచారాన్ని కూడా అందించాలి. దాంతో ఇటువంటి యాప్స్ వాడుగున్న మనదేశంలోని ప్రముఖుల వ్యక్తిగత సమాచారం చైనా యాప్స్ దగ్గర ఉంటుంది. తమ దగ్గరున్న వ్యక్తిగత సమాచారం ఆధారంగా మరింత సమాచారాన్ని రాబట్టుకుని వాళ్ళపై నిరంతర నిఘాను చైనా ఏర్పాటు చేసిందని కథనం ద్వారా బయటపడింది.
అసలే మనదేశం సరిహద్దులో చైనా సైన్యానికి ఏమాత్రం పడటం లేదు. గడచిన నెలరోజులుగా గాల్వాన్ లోయ, పాంగ్యాంగ్ సరస్సు ప్రాంతంతో పాటు సరిహద్దుల్లో అనేక చోట్ల రెండు దేశాల సైన్యాలకు పెద్ద ఎత్తునే పోరాటాలు జరుగుతన్నాయి. గాల్వాన్ లోయలో జరిగిన పోరాటంలో మన సైనికులు 20 మంది మరణించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపధ్యంలోనే మనదేశంలో ఉపయోగించే డ్రాగన్ అప్లికేషన్లను కేంద్రప్రభుత్వం నిషేధించింది.
మొత్తానికి రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా ఉద్రిక్తంగా ఉన్న ఇటువంటి నేపధ్యంలో మన ప్రముఖులపై డ్రాగన్ నిఘా పెట్టిందనే కథనం సంచలనంగా మారింది. అందులోను పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న సోమవారం నాడే కథనం కూడా ప్రచురితమవ్వటం గమనార్హం. కాబట్టి సమావేశాల్లో కథనంపై పెద్ద చర్చే జరుగుతుందనటంలో సందేహం లేదు. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.