చైనా తోక వంక‌రే..! ఉప‌సంహ‌ర‌ణ అంటూనే బ‌ల‌గాల మోహ‌రింపు

By మధుసూదనరావు రామదుర్గం  Published on  23 July 2020 10:49 AM GMT
చైనా తోక వంక‌రే..! ఉప‌సంహ‌ర‌ణ అంటూనే బ‌ల‌గాల మోహ‌రింపు

ప్ర‌పంచ‌దేశాల‌న్నీ మ‌హ‌మ్మారి క‌రోనా బారిన‌ప‌డి విల‌విల్లాడుతూ...అవిశ్రాంతంగా పోరాడుతుంటే...ఆ వ్యాధిని అల‌వోక‌గా అంద‌రికీ అంటించినా చైనా మాత్రం పొరుగు దేశం భార‌త్‌తో క‌య్యానికి కాలుదువ్వుతోంది. స‌రిహ‌ద్దు ల‌ద్దాఖ్ వ‌ద్ద త‌న ఉత్త‌ర ప్ర‌తాపం ప్ర‌ద‌ర్శిస్తోంది. చైనా ఈ తీరు చూస్తుంటే ఈ క‌రోనా వైర‌స్ పై ప్ర‌పంచ దేశాల అనుమానాలు స‌మంజ‌స‌మే అని అనిపిస్తుంది. లేకుంటే.. తొలుత క‌రోనా వ్యాధిని గుర్తించి తేరుకున్న దేశంగా చైనా సాటి దేశాల‌కు సాయం అందించే మాట ప‌క్క‌నుంచి ఈ విప‌త్క‌ర వేళ‌లో యుద్ధ రాజ‌కీయాలు చేస్తోంది.

మొద‌ట్నుంచి చైనా భార‌త్ శ‌క్తిని త‌క్కువ‌గా అంచ‌నా వేస్తునే ఉంది. ఉప‌సంహ‌ర‌ణ మంత్రాన్ని ప‌ఠిస్తూ దొంగ కొంగ‌జ‌పం చేస్తున్న చైనా మ‌రోసారి త‌న వ‌క్ర బుద్ధిని బైట‌పెట్టుకుంది. భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో పిపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ (పీఎల్ఏ) ల‌ద్దాఖ్ లో దాదాపు 40 వేల మంది సైన్యాన్ని మ‌ళ్లీ మోహ‌రించింది. నెల‌కింద‌ట చేసిన దుష్కృత్య ఫ‌లితంగా ఇప్ప‌టికే భార‌త్ టిక్ టాక్ తో స‌హా దాదాపు 59 చైనా యాప్ ల‌ను నిషేధించింది. అమెరికాలో అయితే ట్రంప్ బాహ‌టంగానే చైనాపై దుమ్మెత్తి పోస్తున్నాడు. అయినా త‌న దుర్బుద్ధి ఏమాత్రం మార్చుకోని చైనా ఈ తాజీ చ‌ర్య‌ల‌తో బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ‌పై త‌న విముఖ‌త్వాన్ని బ‌హిర్గ‌తం చేసింది.

ల‌ద్దాఖ్ లో సైన్య ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క‌ట‌న‌ను చైనా తానే గౌర‌వించుకోవ‌డం లేదు. ఏఎన్ఏ న్యూస్ మీడియా ఈ విష‌యంగా క‌థ‌నం ప్ర‌చురించింది. ఇందులో చైనా తీరుతెన్నుల‌పై ప‌లు కీల‌కాంశాల‌ను ప్ర‌స్తావించింది. స‌రిహ‌ద్దు ప్రాంతం ల‌ద్ద‌ఖ్ లో భార‌త్‌తో ఘ‌ర్ష‌ణ అనంత‌రం ఇరుదేశాల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు, వాదోప‌వాదాల అనంత‌రం చైనా సైన్య ఉప‌సంహ‌ర‌ణ‌కు అంగీక‌రించినా.. త‌ద్విరుద్ధంగానే ప్ర‌వ‌ర్తిస్తోంది. త‌న బ‌ల‌గాల‌ను వెన‌క్కు తీసుకోడానికి స‌సేమిరా అంటోంది. పైగా 40వేల‌మంది సైన్యాన్ని, భారీ ఆయుధాల‌తో అక్క‌డే తిష్ట‌వేసి మ‌రోసారి మ‌న‌దేశ స‌హ‌నాన్ని రెచ్చ‌గొడుతోంది. ఆయుధాలే కాదు ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్ లు, సుదూర ప్ర‌దేశాల విధ్వంస ల‌క్ష్యంతో త‌యారైన ఆర్టెలరీల‌ను స‌రిహ‌ద్దులో ఉంచింది. చివ‌రి విడ‌త చ‌ర్చ‌ల త‌ర్వాత పైన్య విర‌మ‌ణ తంతు ఇంకా ప్రారంభించ‌నే లేదు.

ఎందుకీ యుద్ధ‌మేఘం

అరుణాచ‌ల్లోని 65వేల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల భూభాగం త‌మ‌దేన‌ని చైనా వాద‌న లేవ‌నెత్త‌డంతో వివాదం మొద‌లైంది. ఈ ప్రాంతాన్ని ద‌క్షిణ టిబెట్‌గా అభివ‌ర్ణిస్తోంది. ఈ ప్రాంతాన్ని రెండు మార్గాల ద్వారా చేరుకునే వీలుంది. ఒక‌టి ప‌శ్చిమ త‌వాంగ్, రెండోది తూర్పున వ‌లోంగ్. 1962 ఘ‌ర్ష‌ణ‌లోనూ ఈ రెండు ప్రాంతాల నుంచే చొర‌బ‌డ‌టానికి చైనా ప్ర‌య‌త్నించింది. అరుణాచ‌ల్ లోని కొన్ని భూభాగాలు త‌మ చొర‌బాటుకు అనుకూలంగా ఉండ‌టంతో చైనా ఈ దుస్సాహ‌సానికి బ‌రితెగిస్తోంది. చైనాకు దీటుగా మ‌నం కూడా అరుణాచ‌ల్‌లో సైన్యాల‌ను మోహ‌రించి చాలాకాలం ఉంచాలంటే అర్థికంగా పెను భార‌మ‌వుతుంది. ఇప్ప‌టికే క‌రోనా దెబ్బ‌కు దేశ ఆర్ధికం కుదేల‌యింది.

అయినా మొక్క‌వోని ధైర్యంతో ల‌ద్దాఖ్ వ‌ద్ద చైనాకు ప్ర‌తిస‌వాల్‌గా సైనికుల‌ను మ‌నదేశ‌మూ మోహ‌రించింది. చ‌ర్చ‌లెన్ని చేప‌ట్టినా ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే క‌రోనా వ్య‌వ‌హారంలో చైనా అమెరికా, ఆస్ట్రేలియా, త‌దిత‌ర‌ దేశాల నుంచి ఒంట‌రిగా మారుతోంది. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఏ చిన్న అవ‌కాశం దొరికినా చాలు చైనా పై క‌స్సుమంటూ లేస్తున్నాడు. ఇలాంటి స్థితిలోనూ చైనా త‌న బుద్ధి ఏమాత్రం మార్చుకోలేక‌పోతుందంటే.. చైనా తోక వంక‌రే ఎప్ప‌టికీ అని ప్ర‌పంచ‌దేశాలు అనుకునే దుస్థితి దాపురిస్తుంది.

Next Story