ఎప్పటికీ వదులుకోకు.! భరోసా ఇచ్చిన చిన్నారి మాట
By మధుసూదనరావు రామదుర్గం Published on 23 July 2020 3:47 PM ISTకరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుత మానవీయ ఘటనలు సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్నాయి. ఈ కథనాలు ప్రజలకు కాసింత ధైర్యం.. మరి కాసింత నమ్మకాన్ని ఇస్తున్నాయి. ప్రాణాంతక వైరస్ కరోనాతో ప్రపంచమే భీకరయుద్ధం చేస్తున్న ఈ విపత్కర వేళలో చిరు ఆశను రేకెత్తించే ఓ చిన్న మాట.. ఎంతో సాంత్వన చేకూరుస్తుంది. అంతే కాదు యుద్ధంలో నిలిచే నిబ్బరాన్ని కలిగిస్తుంది. మనం గమనించం గానీ కష్టాలు కమ్మేసినపుడు మనసు బెంగగా మారినపుడు సాటివారి పలకరింపు కోసం తహతహలాడుతుంటాం. వారు తెగించి ఏ సాయం చేయకపోయినా మాటసాయం చాలు ఆ కష్టసంద్రాన్ని ఉత్సాహంగా ఈదేయడానికి.
అందుకే మంచిమాటకు.. మంచి వాక్యానికి విపరీతమైన శక్తి ఉంటుంది. తీవ్ర కుంగుబాటులో ఉన్న వారిని కులాసాగా కనిపిస్తున్నారే అన్న మాట చాలు మళ్లీ పుంజుకోడానికి. ఆ మాటదేముంది.. ఆ సాహిత్యంలో ఏముంది గొప్ప అనుకుంటామే గానీ ఆ ఆందోళనలో చిక్కుకున్న వారిని అడగండి.. కుశలమా అన్న మాటకు ఎంత మహత్వం ఉందో చెబుతారు. అలాగే అనవసర ఉద్దేశపూర్వక విమర్శ మనిషిని రోజంతా నీరసించేలా చేయగలదు. సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో వస్తున్న కరోనా విస్మయకర వార్తలు చూపరులు, చదువరులపై విపరీతంగా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే చాలా మంది వైద్యులు కరోనా వార్తలు చూడ్డం ఆపేయండి ఫస్ట్ అంటున్నారు.
తాజాగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లో ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. షాపింగ్ కోసం దగ్గర్లోని కెమార్ట్ మాల్ కు వెళ్లిన ఆమె సరుకుల కొనుగోలు చేసి ఇంటికొచ్చాక బాస్కెట్లోని సరుకుల్ని తీసి సర్దుతుంటే.. అందులోంచి చిరిగిన ఓ కాయితంపై వంకరటింకరగా చిన్నపిల్ల రాసినట్టుండే ఓ మాట కనిపించింది. గత కొన్ని రోజులుగా డిప్రెషన్ తో బాధపడుతున్న ఆమెకు ఆ మాట కొండంత ధైర్యాన్నిచ్చింది.
రాసిందెవరో తెలీదు.. ఎందుకు రాశారో అసలు తెలీదు.. రాతను బట్టి చిన్నారి రాసిందనుకుంది. మాట చిన్నదే అయినా మహత్వం గొప్పదిగా పనిచేసింది.. ఈ అపరిచితులు ఎవరో గానీ నా మనసును నా పరిస్థితిని అర్థం చేసుకుని రాసినట్టుంది. వారికి ఎంతగా థ్యాంక్స్ చెప్పినా తక్కువే.. అనుకుంది. ఇదే భావాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. నెవర్ గివప్ అంటూ రాసిన ఆ చిరిగిన కాయితపు పిక్ కూడా జతచేసింది. ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది.
మనసు చీకటి గయ్యారంలా మారినపుడు మరచిపోయిన పాత మిత్రుడు చాట్ లో హాయ్ అంటే చాలు సంజీవని మంత్రం వేసినట్టే మనసు ఉత్సాహిస్తుంది. మరి కొన్ని సమయాల్లో ఏమాత్రం సంబంధం లేనివారు అపరిచితులు ఆప్యాయంగా పలకరించినపుడు అప్పటిదాకా గుండెలో గూడు కట్టుకున్న బాధ ఇట్టే మాయమై పోతుంది.
ప్రత్యేకించి ఇలాంటి దుర్భర కష్టాల్లో మనకు భరోసా ఇచ్చే ఓ చిన్న మాట.. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరు పలికినా అది తారకమంత్రంలా పనిచేస్తుంది. అందుకే వాగ్బూషణం భూషణం అన్నాడు బర్తృహరి తన సుభాషితాల్లో. వెంటనే నాకు గోరంత దీపం కొండంత వెలుగు.. చిగురంత ఆశ బతుకంత వెలుగు అన్న సినిమా పాట గుర్తొచ్చింది. నిజమే కదా మనం కేవలం పాట అనుకుంటాం గానీ అందులో సాహిత్యం గుర్తుచేసుకుంటే పాట విలువ పదివేల రెట్లు పెరుగుతుంది. ఆస్ట్రేలియా అపరిచిత వాక్యంలా!!