టిక్ టాక్ స్టార్లకు భారీగా డిమాండ్.. కోటి రూపాయల వరకూ సంపాదించవచ్చు..!

By సుభాష్  Published on  23 July 2020 8:55 AM GMT
టిక్ టాక్ స్టార్లకు భారీగా డిమాండ్.. కోటి రూపాయల వరకూ సంపాదించవచ్చు..!

టిక్ టాక్ యాప్ ను భారత్ లో బ్యాన్ చేసిన తర్వాత ఆ గ్యాప్ ను పూర్తి చేయడానికి ఎన్నో సంస్థలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. టిక్ టాక్ స్థానాన్ని ఆక్రమించడానికి డజనుకు పైగా యాప్ కంపెనీల మధ్య భారీ పోటీ ఉంది.

ఒక కంపెనీ పోవడంతో పది కంపెనీలు పుట్టుకొచ్చాయి. దీంతో పోటీ కూడా అంతే స్థాయిలో ఉంది. ముఖ్యంగా టిక్ టాక్ స్టార్లను కేవలం తమ యాప్ లో మాత్రమే చేయించుకోవాలని భావిస్తూ ఉన్నాయి సదరు కంపెనీలు. కంటెంట్ ను క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు వీడియోలను అప్లోడ్ చేసే వారి వలన యాప్ ను చూసే వారి సంఖ్య కూడా పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. టిక్ టాక్ లో మిలియన్ల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న వారు.. ఏ ప్లాట్ ఫామ్ లో తిరిగి తమ జర్నీని మొదలుపెట్టాలా అని యోచిస్తూ ఉన్నారు. అలాంటి స్టార్లకు గ్యాలం వేయాలని ఈ కొత్త యాప్ల యాజమాన్యాలు భావిస్తూ ఉన్నాయి.

టిక్ టాక్ స్టార్లను గుర్తించిన సదరు కంపెనీలు.. ఇప్పటికే వారిని ఆకర్షించడానికి భారీగా ఆఫర్లను ఇస్తున్నాయి. మూడు లక్షల రూపాయల నుండి 1కోటి రూపాయల వరకూ భారీ ఆఫర్ ను అందిస్తూ ఉన్నారు. చాలా కంపెనీలు, కెరియర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు ఇప్పటికే ఆ పనిలో ఉన్నాయి. ఆరు నెలల పాటూ ఉన్న అగ్రిమెంట్ లో మంచి ఆదాయం అందించనున్నారు. అందుకు సంబంధించిన రేట్ కార్డును కూడా ఇప్పటికే తయారు చేసుకున్నాయి ఆయా కంపెనీలు.

మంచి కంటెంట్ క్రియేటర్లు ఇతర యాప్ల లో ఫేమస్ అవ్వడం కంటే మన యాప్ లోకే తీసుకుందామన్న పోటీ కంపెనీల మధ్య ఉండడంతో రెండు మూడు రెట్లు ఎక్కువ ఇవ్వడానికి కూడా సంస్థలు సిద్ధపడుతూ ఉన్నాయి. షేర్ చాట్ కు చెందిన మోజ్, మిత్రోన్, చింగారి, రొపోసో, ట్రెల్ లాంటి సంస్థలు టిక్ టాక్ స్టార్లను ఆకర్షించడానికి భారీగా ఆఫర్లను ఇస్తున్నాయి. సదరు కంపెనీలు ఆయా స్టార్లకు మెసేజీలు పెట్టడం, ఈమెయిల్స్ పెట్టడం వంటివి చేస్తూ ఉన్నాయి. వారితో డైరెక్ట్ గా కాంట్రాక్ట్ లు మాట్లాడుతూ ఉన్నాయి. వయసు, వారు చేసే కంటెంట్ ను బట్టి ఆయా సంస్థలు ఆఫర్ చేస్తూ ఉన్నాయి. సమయం చూసి.. సరైన కాంట్రాక్ట్ మాట్లాడుకుని.. మంచి కంటెంట్ ద్వారా అడుగుపెట్టాలని టిక్ టాక్ స్టార్లు కొందరు యోచిస్తూ ఉన్నారు. ఇంకొందరు టిక్ టాక్ బ్యాన్ అవ్వగానే ఆయా యాప్లలో ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడ్డారు.

20 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న వాళ్లకు 25 లక్షల నుండి 75 లక్షల వరకూ రెమ్యునరేషన్ అందనుంది. టాప్ లో ఉన్న వాళ్లకు కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. 10 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న వాళ్లకు 15 లక్షల నుండి 20 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. ఒక మిలియన్ కు పైగా ఫాలోవర్లు ఉన్న వాళ్లకు మూడు లక్షల నుండి 6 లక్షల రూపాయల వరకూ డిమాండ్ ఉంది. ఇక అదనంగా బ్రాండ్ ల నుండి యాడ్స్, టీవీ షో ల ద్వారా డబ్బులు ఆర్జించే అవకాశం ఉంది.

Next Story