హైదరాబాద్‌ నగరంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని సోషల్‌ మీడియాలో వదంతులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే నగరానికి చెందిన ప్రముఖ యానిమేషన్‌ కంపెనీ కరోనా వైరస్‌పై తన దైన శైలిలో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేపట్టింది. కంపెనీ రూపొందించిన, అత్యంత ప్రజాదరణ పొందిన కార్టూన్‌ క్యారెక్టర్‌ చోటా భీమ్‌ ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు పాటించాలంటూ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా వైరస్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారంతో వీడియో రూపొందించారు.

చోటా భీమ్‌ వీడియోను తెలంగాణ మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. చిన్న పిల్లలు అత్యంత ఇష్టపడే చోటా భీమ్‌ క్యారెక్టర్‌ ద్వారా కరోనా వైరస్‌ లాంటి అంశంపై ప్రజలను చైతన్య పరుస్తున్న గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌ సంస్థను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. చోటా భీమ్‌ క్యారెక్టర్‌ ద్వారా చేపట్టిన ఈ ప్రచారం ముఖ్యంగా స్కూల్‌ పిల్లలకు విస్తృత అవగాహన కల్పిస్తుందని గ్రీన్‌ గోల్డ్‌ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.