ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న వాళ్లకు కరోనా.. ఐసోలేషన్ లోకి వెళ్లిన సీఎం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Aug 2020 2:37 PM GMT
ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న వాళ్లకు కరోనా.. ఐసోలేషన్ లోకి వెళ్లిన సీఎం

దేశంలో ఎంతో మంది రాజకీయనాయకులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే..! చాలా మంది కోలుకున్నారు కూడానూ. అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోలుకున్నారు. త్వరలోనే ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ కానున్నారు. కరోనా బారిన పడిన అమిత్ షా గురుగావ్ మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 2న మేదాంత నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆయన అలసట, స్వల్ప ఛాతీ నొప్పికి గురయ్యారు. ఈ నెల 18న ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు.

ఇప్పుడు ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేళ్ ఐసోలేషన్ లో ఉండాల్సి వస్తోంది. అందుకు కారణం ఆయన స్టాఫ్ మెంబర్లకు కరోనా సోకడమే..! ఇద్దరు స్టాఫ్ మెంబర్లకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలుస్తోంది. కరోనా పాజిటివ్ అని వచ్చిన వారిలో ముఖ్యమంత్రి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రికి కోవిద్-19 టెస్టు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది.

'నా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ లకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. నాకు టెస్టు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా నాలుగు రోజుల పాటూ ఐసోలేషన్ లోకి వెళ్ళబోతున్నాను. ఇలాంటి సమయాల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.' అని ముఖ్యమంత్రి హిందీలో ట్వీట్ చేశారు. రాయ్ పూర్ లోని అధికారిక నివాసంలో భాగేళ్ ఐసోలేషన్ లో ఉంటున్నారని అధికారులు తెలిపారు. ఛత్తీస్ఘడ్ లో ఆగష్టు 29 వరకూ 28,746 కోవిద్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Next Story
Share it