క్రికెట్ అభిమానులకు మరో శాడ్ న్యూస్.. మాజీ క్రికెటర్ కరోనాతో మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Aug 2020 2:50 PM GMT
క్రికెట్ అభిమానులకు మరో శాడ్ న్యూస్.. మాజీ క్రికెటర్ కరోనాతో మృతి

భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కరోనా కారణంగా కన్నుమూశారు. 1970 లలో సునీల్ గవాస్కర్ తో కలిసి ఓపెనింగ్ కు వచ్చే చేతన్ చౌహన్ అప్పటి పేస్ అటాక్ ను ఎదుర్కొని నిలబడేవాడు. 73 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశారు.

బీజేపీ నేత ఉత్తరప్రదేశ్ కేబినెట్ లో మంత్రి అయిన ఆయనకు కొన్నిరోజుల కిందట కరోనా సోకడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఉదయం ఆయనకు కిడ్నీలు విఫలమైనట్టు వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత అవయవాలన్నీ వైఫల్యం చెందడంతో చేతన్ చౌహాన్ మరణించినట్లు అధికారులు గుర్తించారు.

'మా పెద్దన్న శ్రీ చేతన్ చౌహాన్ మమ్మల్ని వదిలి ఈరోజు వెళ్లిపోయారు. ఆయన కోలుకోవాలంటూ పూజలు చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఆయన కుమారుడు వినాయక్ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాడు.' అని సోదరుడు పుష్పేంద్ర మీడియాకు తెలిపారు.

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఢిల్లీ క్రికెట్ సంఘానికి వివిధ పదవుల ద్వారా సేవలు అందించారు. ఆపై రాజకీయాల్లోనూ ప్రవేశించి ఉత్తరప్రదేశ్ బీజేపీ క్యాడర్ లో రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

చౌహాన్ 40 టెస్టులు, ఏడు వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 2,084 పరుగులు చేసిన చౌహన్ 16 హాఫ్ సెంచరీలు బాదాడు. కొన్ని వన్డేలు మాత్రమే ఆడినప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 11143 పరుగులు చేశారు. 21 సెంచరీలు, 59 హాఫ్ సెంచరీలు చేశారు. అప్పటి పేస్ అటాక్ ను ఎదుర్కొని గవాస్కర్ తో కలిసి 11 సెంచరీ వికెట్ పార్ట్నర్ షిప్ లను నమోదు చేశారు. 1977 లో భారత్ ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు జెఫ్ థాంసన్ పేస్ అటాక్ కు అడ్డుగా నిలబడి పెర్త్ బౌన్సీ పిచ్ పై 88 పరుగులు చేశారు. 1981 లో అర్జున అవార్డు కూడా అందుకున్నారు.

Next Story