ప్రాణాలు తీసిన లాఫింగ్ గ్యాస్
By సుభాష్
నవ్వులు తెప్పించే వాయువుగా పేరొందిన లాఫింగ్ గ్యాస్ ఓ జంట ప్రాణాలు తీసింది. . ఉక్రెయిన్ చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్, అతని గర్ల్ ఫ్రెండ్ లను బలిగొంది. మాస్కోలోని ఒక ఫ్లాట్‌లో వీరు విగతజీవులై కనిపించారు. లాఫింగ్ గ్యాస్ వల్లే వీరు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు చెప్పారు. స్టానిస్‌లావ్ బోగ్డానోవిచ్, అలెజ్గాండ్రా వెర్నిగోరా మాస్కోలో ఉంటున్నారు. ఇద్దరూ స్పీడ్ చెస్ ఛాంపియన్ లు . ఇటీవల ఒక ఇంటర్నెట్ చెస్ పోటీలో రష్యా తరఫున బరిలోకి దిగారు. ఉక్రెయిన్‌పై తలపడి, గెలుపొందారు. అయితే తాజాగా వారిద్దరూ వారం రోజుల నుంచీ కనపడకుండా పోయారు. అనంతరం వీరి ఫ్లాట్‌లో శవాలై కనిపించారు. వీరి ఇంట్లో లాఫింగ్ గ్యాస్ బెలూన్లు ఉన్నాయి. బెలూన్ సాయంతో ఈ గ్యాస్‌ను పీలుస్తుంటారని తెలుస్తోంది.
లాఫింగ్ గ్యాస్‌గా పేరు పొందిన నైట్రస్ ఆక్సైడ్‌ను శస్త్రచికిత్సల్లో మత్తుమందుగా ఉపయోగిస్తారు. నొప్పి నుంచి ఉపశమనానికీ వాడుతున్నారు. దీనిని పీల్చినప్పుడు ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో కలుస్తుంది. తర్వాత వేగంగా మెదడును చేరుతుంది. శరీర సహజసిద్ధమైన మత్తు పదార్థాలైన ఎండార్ఫిన్లు, డోపామైన్‌ను విడుదల చేసేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా సంతోషకరమైన భావనలు కలిగి నవ్వాలనిపిస్తుంది. అందుకే దీనికి లాఫింగ్ గ్యాస్ అని పేరు వచ్చింది. అయితే మత్తు, వినోదం కోసం దీనిని పూర్తిగా పీల్చినప్పుడు వికటించి మరణాలు సంభవిస్తున్నాయి.
ఈ యువ జంట మరణాలకు సంబంధించి లాఫింగ్ గ్యాస్ తప్ప అనుమానించదగ్గ అంశాలేవీ కనిపించడంలేదని రష్యా దర్యాప్తు అధికారులు
తెలిపారు.