భార్యకు కరోనా సోకిందని బాత్‌రూమ్‌లో వేసి తాళం వేసిన భర్త.. తర్వాత ఏమైందంటే..

By సుభాష్  Published on  5 March 2020 4:19 AM GMT
భార్యకు కరోనా సోకిందని బాత్‌రూమ్‌లో వేసి తాళం వేసిన భర్త.. తర్వాత ఏమైందంటే..

చైనాలో పుట్టిన కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) ప్రపంచ వ్యాప్తంగా గజగజలాడిస్తోంది. చైనాతో పాటు దాదాపు 90 దేశాల వరకు ఈ కరోనా వ్యాపించింది. ఈ వైరస్‌ బారిన వేలాదిగా మృతి చెందగా, లక్షలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈవైరస్‌ తెలంగాణకు చేరింది. హైదరాబాద్‌లో ఒక కేసు నమోదు కాగా, మరో కేసు ఢిల్లీలో నమోదైంది. ఈ క్రమంలో లిథుయానియాలో ఓ దారుణం చోటు చేసుకుంది. తన భార్యకు కరోనా వైరస్‌ సోకిందనే అనుమానంతో భర్త భార్యను బాత్‌రూమ్‌లో పెట్టి తాళం వేశాడు.

ఎంత చెప్పినా కూడా వినకుండా తాళం తీయకపోవడంతో భార్య కేకలు వేస్తూ ఇరుగుపొరుగు వారి ద్వారా పోలీసులకు సమాచారం అందించేలా చేసింది. దీంతో పోలీసులు వెంటనే ఆమె ఇంటికి చేరుకుని బాత్‌రూమ్‌ నుంచి ఆమెను బయటకు తీసుకువచ్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ రక్త పరీక్షలు చేయగా, ఆమెకు కరోనా లేనట్లు నిర్ధారణ అయింది. కాగా, కరోనా గురించి వైరల్‌ అవుతున్న నేపథ్యంలో ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తితో ఆయన భార్య అతనితో మాట్లాడిందని, అప్పటి నుంచి అనుమానం పెంచుకున్న భర్త కరోనా వచ్చిందని ఇలా భార్యను బాత్‌రూమ్‌లో వేసి తాళం వేసినట్లు తెలిసింది. ఈ శాడిస్ట్‌ భర్త నిర్వాకంపై ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, ప్రస్తుతం ఎవరూ తుమ్మినా, దగ్గినా అతనికి కరోనా ఉందని అనుమానిస్తున్నారు. ఓ వ్యక్తి తుమ్మినా కూడా అతని దరిదాపుల్లోకి ఎవరు రావడం లేదు. సోషల్‌ మీడియాలో కూడా కరోనా గురించి అసత్య ప్రచారాలు ఎక్కువ కావడంతో ప్రజలకు రోజురోజుకు అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. దీనిపై ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు, వైద్యులు పదేపదే చెబుతున్నా అనుమానాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. కరోనా ఉన్న వ్యక్తిని ఒక నేరం చేసిన వ్యక్తిలా చూస్తున్నారు.

Next Story