విశాఖలో భారీ ప్రమాదం.. రసాయన వాయువు లీకై..
By సుభాష్ Published on 7 May 2020 7:06 AM ISTవిశాఖలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ ఆర్ వెంటాపురంలో ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు సంభవించింది. పరిశ్రమ నుంచి వాయువు దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లీకైన రసాయన గాలి పీల్చడం వల్ల ప్రజలు ఊపిరి పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రసాయన గాలి పీల్చడం వల్ల 200కిపైగా తీవ్ర అస్వస్థలకు గురైనట్లు కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.
కాగా, ఈ రసాయన గాలి పీల్చడం వల్ల చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, ఇతర శ్వాసకు సంబంధించిన వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రసాయన గాలి పీల్చడం వల్ల కొందరు అస్వస్థతకు గురై రోడ్డుపైనే పడిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు.
దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు సైరన్ మోగిస్తూ తమ తమ ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా సూచించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.
అయితే తెల్లవారుజామున 4 గంటలకు ఈ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైనట్లు అధికారులు గుర్తించారు. లీకేజీలను అరికట్టేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.