'చంద్రయాన్‌-3'.. ఆ శాస్త్రవేత్తను ఎందుకు తొలగించారో..?

By అంజి  Published on  18 Dec 2019 7:50 AM GMT
చంద్రయాన్‌-3.. ఆ శాస్త్రవేత్తను ఎందుకు తొలగించారో..?

ఢిల్లీ: చంద్రయాన్‌-3 ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ముమ్మరం చేసింది. చంద్రయాన్‌-2 ప్రయోగం చివరి దశలో తలెత్తిన లోపాలను సరిదిద్దుకొని ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రయాన్‌-2 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన శాస్త్రవేత్త వనితను చంద్రయాన్‌-3 ప్రయోగం నుంచి తప్పించింది. ఇస్రో మెయిన్‌ ఆఫీసులో పని చేసే పీ. వీరముత్తువేల్‌ను వనిత స్థానంలో ఇస్రో అధికారులు నియమించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చంద్రయాన్‌-2 మిషన్‌ డైరెక్టర్‌ రీతూ కరిథాల్‌ ఈ ప్రాజెక్టులో ఉంచారు. చంద్రయన్‌-2 ప్రయోగాన్ని పూర్తిస్తాయిలో వనిత నేతృత్వంలోని బృందమే పర్యవేక్షించింది. అయితే వనితను బదిలీ చేయడానికి గల కారణాలను మాత్రం ఇస్రో ప్రకటించలేదు.

నవంబర్‌ 28న శాస్త్రవేత్త వనితను పేలోడ్‌, డేటా మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్పేస్‌ ఆస్ట్రానమీ ఏరియా డిప్యూటీ డైరెక్టర్‌ ఇస్రో బదిలీ చేసింది. అంతకు ముందు రీతు కరిథాల్‌ను మిషన్‌ డైరెక్టర్‌గా, వనితను చంద్రయాన్‌-2 మిషన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమిస్తూ ఇస్రో తీసుకున్న నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు. వనిత స్థానంలో శాస్త్రవేత్త వీరముత్తువేల్‌ను ఇస్రో నియమించింది. చంద్రయాన్‌-3 ప్రయోగం కోసం ఇస్రో 29 మంది డిప్యూటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్లను నియమించింది. వీరు ఈ మిషన్‌కు సంబంధించిన వివిధ పనులను పరిశీలించనున్నారు. డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్లుగా ఉన్న 29 మంది సభ్యులకు టీమ్‌ హెడ్‌గా వీరముత్తువేల్‌ ఉంటారని డిసెంబర్‌ 7న ఇస్రో ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్‌ 14 నుంచి చంద్రయాన్‌-3 మిషన్‌కు సంబంధించిన పనులను ముమ్మరం చేశారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్‌-2 ప్రయోగం 98 శాతం విజయం సాధించింది. అయితే ఈ ప్రయోగం చివరి క్షణంలో విఫలమైన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 7న విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై దిగుతుండగా.. ఇస్రోతో సంబంధాలు కోల్పోయింది. తర్వాత 14 రోజుల పాటు విక్రమ్‌ ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ పునరుద్ధరణ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాసా కూడా చంద్రుడి ఉపరితలంపై పడి ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌ను కనుగోనేందుకు తీవ్రంగా శ్రమించింది. రెండవ ప్రయత్నంలో విక్రమ్‌ దిగినట్లుగా భావిస్తున్న ప్రాంతాన్ని నాసాకు చెందిన లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ అక్టోబర్‌ 14న ఫొటోలు తీసింది. ఆ చిత్రాల్లో కూడా విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీ కనిపించడం లేదని నాసా వెల్లడించింది. అయితే ఈ ఫొటోల్లో విక్రమ్‌ కనిపించకపోవడంతో శ్రాస్తవేత్తలు నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత విక్రమ్‌ ల్యాండర్‌ కూలిన శకలాలను నాసా తన శాటిలైట్‌తో ఫొటోలు తీసి పంపింది.

Next Story