అమరావతి అంటే నాలుగు భవనాలు కాదు...
By రాణి Published on 17 Dec 2019 6:24 PM ISTఅమరావతి అంటే నాలుగు భవనాలు కాదు..భవిష్యత్ తరాల ఉపాధికి బాసటగా ఉండే రాజధాని అని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో అమరావతి రాజధానిపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఏపీ రాజధాని నిర్మాణం పై శివరామకృష్ణన్ కమిటీ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తే...ఎక్కువ మంది విజయవాడ - గుంటూరు మధ్య ప్రాంతాన్ని సూచించారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి తెలుగు బిడ్డ గర్వించేలా ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి కావాలని ఆకాంక్షించామన్నారు. 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాల కల్పవల్లి, ప్రతి పంచాయతీ సంక్షేమానికి నిక్షేపం అమరావతి అని చంద్రబాబు చెప్పారు. అమరావతి అంటే ప్రజా రాజధాని అని, ఏ కొంతమందికో లేకపోతే ఏదొక వర్గానికో చెందింది కాదన్నారు చంద్రబాబు. సంపద సృష్టించకపోతే ప్రభుత్వానికి ఆదాయం రాదని, 13 జిల్లాల అభివృద్ధికి రాజధానే ఆదాయ వనరు అని చంద్రబాబు వివరించారు. కేవలం రాజధాని వల్లే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిలో నా ముద్ర ఎప్పటికీ ఉంటుంది
తెలంగాణ విడిపోయాక ఏపీ రాజధాని ప్రాంతం ఎంపికపై ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సూచనను చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా గుర్తు చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం ఇష్టం లేక విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు మద్దతిస్తున్నట్లు సెప్టెంబర్4, 2014 జగన్ అసెంబ్లీలో చెప్పారని చంద్రబాబు వివరించారు. రాజధాని కోసం 30 వేల ఎకరాల భూమిని సేకరించాలని జగనే ఆనాడు సూచించారని, రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో 33 వేల ఎకరాల భూమిని సేకరించామన్నారు. అయితే రాజధాని ఏరియాలో పోటీ చేసి ఎందుకు ఓడిపోయారని కొందరు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు అసెంబ్లిలో సమాధానమిచ్చారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసినా ఖైరతాబాద్ లో 2004లో ఓటమి పాలయ్యామని, అలాగని ఓటమికి తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. 'హైదరాబాద్ అభివృద్ధిలో నా ముద్ర ఎప్పటికీ ఉంటుంది. అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు గురించి అప్పుడే ఆలోచించా. అదీ నాకున్న విజన్' అని చంద్రబాబు గర్వంగా చెప్పారు.